Saturday, November 16, 2024

Hat trick – న‌రేంద్రుడికే ప్ర‌ధాని పీఠం .. చంద్ర‌బాబు,ప‌వ‌న్ ల‌కు ప‌శంస‌లు

ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ ప్రతినిధి: భారతావనిలో హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ సభ పక్ష నేతగా మోదీని ఎన్డీయే ఏకగ్రీవంగా ప్రకటించింది. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో.. కూటమి అగ్రనేతలు తమ మద్దతును ప్రకటించారు. ఎన్డీయే పక్షనేతగా మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ పక్ష నేతలు క‌ల‌వ‌నున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను అంద‌జేయ‌నున్నారు. ఇక‌.. ఉదయం 11.30 గంటలకు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. ఎన్డీయే సమావేశానికి కూట‌మి నేతలు చంద్రబాబు, నితీశ్ కుమార్, పవన్ కల్యాణ్, అజిత్ పవార్ పాల్గొన్నారు. ఎన్డీయే పక్ష ఎంపీలు అంద‌రూ హాజరయ్యారు.

క్వాలిటీ ఆఫ్ లైఫ్.. గుడ్ గవర్నెన్స్ అందిస్తామ‌న్న‌ మోదీ

- Advertisement -

పేదల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఈ అయిదేళ్లలోనే కాకుండా.. వచ్చే పదేళ్లలో క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుడ్ గవర్నెన్స్‌ను అందిస్తామని హ్యాట్రిక్ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎన్డీయే పక్ష సభ్యల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలుపున‌కు కారణం కార్యకర్తలేనని, వారు రేయింబవళ్లు కష్టపడినదానికి ఫలితం ద‌క్కింద‌న్నారు. అలాగే ఎన్డీయే పక్షాల కార్యకర్తలు కూడా తీవ్రంగా శ్రమించారన్నారు. మూడోసారి తనకు దేశప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందే ఏర్పడిన ఏ కూటమి ఎన్డీయే లాగా విజయంవంతం కాలేదన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు మెజారిటీ అవసరమైతే.. ప్రభుత్వాన్ని నడిపించడానికి అందరి సహకారం అవసరమన్నారు. క్రైస్తవులు ఎక్కువగా ఉన్న.. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లోనూ సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్నవారందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఒక సునామీ..

పవన్ కల్యాణ్ అంటే పవనం కాదని… సునామీ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎన్డీయే కూటమి సమావేశంలో జనసేనానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన‌ అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారన్నారు. ఏపీలో మనం (ఎన్డీయే కూటమి) చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ అంటే ఓ సునామీ అని అభివర్ణించారు. అలాంటి పవన్ మన సమక్షంలోనే ఉన్నారని, పవన్ కారణంగానే ఏపీలో ఎన్డీయే ఘన విజయం సాధించిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement