Sunday, November 24, 2024

AP: ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం తెస్తే క‌ఠిన చ‌ర్య‌లు… ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి : ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం కానీ, అమ్మడం కానీ ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షకు గురవుతారని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 సమయంలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం బాటిళ్లను, అనుమతి లేకుండా బెల్టు షాపుల ద్వారా అమ్ముతుండగా పట్టుబడిన మద్యం బాటిళ్లను, నాటుసారాను జిల్లా పోలీసు, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు స్థానిక బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో శుక్రవారం ధ్వంసం చేశారు. దాదాపు 27,568 వివిధ రకాల పరిమాణంలో ఉన్న మద్యం బాటిళ్లను (క్వార్టర్, హాఫ్, ఫుల్) రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు.

ఈసందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ… గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పలు సందర్భాల్లో పట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా అనుమతి లేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తూ అమ్ముతున్న వారిపై 300 కేసులు రిజిస్టర్ చేసి, సీజ్ చేసిన మద్యం బాటిళ్లను కూడా దాదాపు 27,568 అన్ని క్వాంటిటీల (5,017.12 లీటర్లు) బాటిళ్లను రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేయడం జరిగిందని, వీటి విలువ దాదాపు 36 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.

అధిక సంపాదనకు ఆశపడి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను సరఫరా చేసి వాటిని అమ్మడం చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే శిక్షార్హులు కాక తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా అనుమతి లేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తూ మద్యం అమ్మకాలు చేయరాదని, అతిక్రమిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాలంలో అక్రమ ధనార్జన కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చాలామంది ముఖ్యంగా యువకులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆయన సూచించారు. పదేపదే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్టులు కూడా నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందిస్తూ, దాడులను మరింతగా ముమ్మరం చేసి పూర్తిస్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తిరుపతి జిల్లా మీదుగా రాష్ట్రం లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. తిరుపతి జిల్లాకు అంతర్ రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ఉండడంతో అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వారు తిరుపతి జిల్లా మీదుగా సరఫరా చేస్తూ రాష్ట్రంలో అక్రమ మధ్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని, కావున తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తిరుపతి జిల్లాలోకి వచ్చే దారులు అన్నింటిలోనూ ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను ముమ్మరం చేస్తూ, దాడులు నిర్వహించి పూర్తిస్థాయిలో ఈ స్మగ్లింగ్ ను అరికట్టడానికి మరింతగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, కులశేఖర్ శాంతిభద్రతలు, రాజేంద్ర సెబ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, తిరుపతి సీఐలు, ఎస్సైలు అండ్ పోలీస్, సెబ్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement