ప్రైవేటు విద్యా సంస్థగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి పేరున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు పలు అంశాలపై చెడ్డపేరు తెచ్చుకుంటున్నాయి. ఫీజుల విషయంలో స్టూడెంట్స్‌తో దారుణంగా వ్యవహరిస్తున్న తీరు నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇదేం తీరని అడగడానికి వచ్చిన తల్లిదండ్రులతోనూ దురుసుగా మాట్లాడారు. దీంతో అటు స్టూడెంట్స్, ఇటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఆవేదన చెందుతూ.. పిల్లల విషయంలో ఏం చేయాలో తెలియక కన్నీరు పెడుతున్నారు.
కాగా, ఫీజులు చెల్లించలేదని ఇవ్వాల (మంగళవారం) నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల స్కూల్‌లో 12 మంది విద్యార్థులను రూమ్ లో పెట్టి ప్రిన్సిపల్ సురేశ్ బంధించిన విషయం వీడియోల ద్వారా వెల్లడయ్యింది. విద్యార్థుల పట్ల కఠినంగా, నిరంకుశంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు బయటి లోకానికి కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రూమ్ లో బంధించడంతో తల్లిదండ్రులను చూసి విద్యార్థులు కన్నీటి పర్వతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా శ్రీ చైతన్య విద్యా సంస్థల దాష్టీకాలపై అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.