అమరావతి, ఆంధ్రప్రభ: : పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వేచ్చా స్వాతంత్య్ర భారతదేశ స్ఫూర్తికి పర్యాయపదంగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిస్వార్ధ స్వాతంత్య్ర సమర యోధునిగా వెంకయ్య దేశం కోసం తన జీవితాన్నే అర్పించారన్నారు. సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ‘జాతీయ సమైఖ్యతలో మువ్వన్నెల జెండా-భారతీయ భాషా సాహిత్యంలో త్రివర్ణ పతాక ప్రతిఫలాలు’ అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్పుకు గవర్నర్ బిశ్వభూషణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ, 1921 మార్చిలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య స్వరాజ్య జెండా రూపకల్పన చేసి మహాత్మా గాంధీజీకి అందించారన్నారు.
ఈ నెల 13 నుంచి 15 వరకు తిరంగాను ఇంటికి తీసుకొచ్చి నివాసాలపై పతాకావిష్కరణ గావించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తున్నదని తెలిపారు. జాతీయ జెండా మనకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు ఆర్.నరసాయమ్మ, ప్రముఖ తెలుగు రచయిత, సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ కె. శివారెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కె. శ్రీనివాసరావు, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.