మనమెవరో.. మనకెవరూ తెలియకపోయినా అప్పు తీసుకోవడం చాలా ఈజీనే.. షూరిటీ కూడా అవసరంలేదు. చేతిలో సెల్‌ఫోన్‌లో ‘లోన్ యాప్’ ఉంటే చాలు. మనకు అర్ధమైనా కాకపోయినా వారడిగిన ఆప్షన్లన్నీ ఓకే నొక్కితే అడిగినంత అమౌంటు ఖాతాలో వచ్చి పడుతుంది. అప్పు తీసుకున్నామన్న విషయం మరెవ్వరికీ తెలీదు. కానీ, తిరిగి తీర్చకుంటేనే అసలు కధ మొదలవుతుంది. పరువు కష్టాలు మొదలై మన ప్రతిష్ట అంగట్లో అమ్మకానికి వస్తుంది. ఇల్లు, ఆఫీసు, బంధువులు, స్నేహితులు ఇలా మన సెల్‌ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లు కలిగిన వ్యక్తులందరికీ సమాచారం వెళ్ళిపోతుంది. ఇంకేముంది పోలీసుస్టేషన్లు , కేసులు, పంచాయితీలు.. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు. ఇది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అప్పులిచ్చే ‘లోన్ యాప్’ల నిర్వాకం, వేధింపులు.
అమరావతి, ఆంధ్రప్రభ : ప్లే స్టోర్‌లో లభించే మనీ లోన్ యాప్‌ల బారిన పడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది వేధింపులకు గురవుతున్నారు. అప్పు తీసుకున్న వారు తీర్చడం ఆలస్యమైనా.. తీర్చలేకున్నా.. వారి ఫోన్‌లోని కాంటాక్టు నెంబర్లన్నింటికీ లోన్ యాప్ నిర్వహకులు అశ్లీల సమాచారం పంపుతూ పరువును బజారుకీడ్చుతున్నారు. మరోవైపు ఈ లోన్ యాప్‌ల పేర్లతోనే నకి లీ యాప్‌లు కూడా ప్లే స్టోర్‌లో దర్శనమిచ్చి ఖాతాదారులను మోసగించి వారి నుంచి వేలు, లక్షల్లో దండుకుని మోసానికి పాల్పడుతున్నాయి. లోన్లు ఇచ్చి వేధించడం ఒక ఎత్తయితే.. లోన్లు ఆశ చూపి డబ్బు దోచుకోవడం మరో మోసం. ఈ రెండూ కూడా సగటు మనిషికి విరక్తి కలిగేలా చేసి ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయి. ఎవరినైనా అడగాలంటే సిగ్గు.. బ్యాంకుల చుట్టూ తిరగలేము ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు ఇదే అసరా అవుతోంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే సెకన్లలో అకౌంట్‌కు డబ్బులు వేసేస్తాం అంటున్న ఆన్‌లైన్ పర్సనల్ లోన్ యాప్‌ల నిర్వహకులు ప్రజల అవసరాలను అసరా చేసుకుని పీక్కుతినే మైక్రోఫైనాన్ ్స లాంటి వాటి కన్నా అత్యంత ప్రమాదకరంగా మారారు. మనకు ముందుగా మెసేజ్‌లు వస్తాయి. అలాగే ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీని వల్ల సదరు యాప్‌లకు ఆదాయం వస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ముందుగానే లోన్‌లో డబ్బు కట్ చేస్తారు.
అలాగే తీసుకున్న లోన్‌కు 1నుంచి 3శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. లాక్‌డౌన్ సమయంలో డబ్బు లేక చాలా మంది మధ్య తరగతి వారు ఈ యాప్‌లనే ఆశ్రయించారు. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్తే చాలు మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్ , మనీ ట్యాప్, పే సెన్స్, ధని, మనీలెండ్స్, క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీ వ్యూ, ఎర్లీ సేలరీ, రూపీ, స్మార్ట్ కాయిన్, లేజీ పే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ ఇలా ఒకటేంటి వందల సంఖ్యలో కనపడతాయి. విద్యార్ధులు, నిరుద్యోగులు, యువకులు ఎక్కువగా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు ఆన్‌లైన్‌లో వెయ్యి నుంచి రెండు, మూడు లక్షల వరకు అప్పు పుడుతోంది. ఇందుకోసం షూరిటీగా లోను తీసుకోవాలనుకునే వారి ఫోన్‌లోని కాంటాక్టు నెంబర్లు ఇస్తే చాలు. డబ్బు అకౌంట్‌లో వచ్చి పడుతుంది.
ఇక అసలు కధ మొదలు..
ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా తీసుకున్న డబ్బు తిరిగి తీర్చడంలో ఆలస్యమైనా, తీర్చలేకున్నా అసలు కధ మొదలవుతుంది. షూరిటీ ఉన్న ఫోన్ నెంబర్లకు మెసేజ్‌లు వెళ్తాయి. మీరు షూరిటీ ఉన్నారు డబ్బు కట్టకుంటే మా మనుషులు ఇంటికి వస్తారు. మీ మీద కేసులు పెడుతున్నామంటూ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతారు. నిజానికి లోను తీసుకున్న వ్యక్తి రుణం పొందినట్లు మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి తెలియకపోవచ్చు. దీంతో సదరు వ్యక్తికి ఫోన్ చేసి తిట్లు పెట్టడం జరుగుతుంది. అంతేకాక కాంటాక్ట్ లో ఉన్న వారందరికీ లోన్ తీసుకున్న వ్యక్తి తాలూకూ వివరాలతో సహా వెళ్ళిపోతాయి. అంతటితో ఆగక అశ్లీల పోస్టులు, పదజాలం, నగ్న దృశ్యాలు లోను తీసుకున్న వ్యక్తి ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపుతారు. లోను తీసుకునే సమయంలోనే మనకు తెలీకుండానే ఒకే అని నొక్కే ఆప్షన్ల ఆధారంగా మన ఫోన్‌లోని సమాచారమంతా అప్పటికే యాప్‌ల నిర్వహకుల చేతిలోకి వెళి ్ళపోయి ఉంటుంది. ఇలా పరువు పోయి సదరు వ్యక్తి బలవన్మరణానికి ఒడిగట్టాల్సి వస్తుంది.
ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం విశాఖపట్నం గాజువాకలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే. నిత్యం పోలీసులకు ఈ యాప్‌లపైనా, రికవరీ టీములపైనా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయి. తిరుపతిలోని ఓ సంస్ధలో పని చేసే వ్యక్తి ఈ యాప్‌ల ద్వారా తీసుకున్న లోన్ తిరిగి చెల్లించనందున అతని స్నేహితులందరికీ ఇలాగే మేసేజ్‌లు రావడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అదేవిధంగా విజయవాడలోనూ ఓ వ్యక్తికి సంబంధించిన వారందరికీ నగ్నంగా అసభ్య ఫొటోలు పంపి వేధింపులకు దిగడంతో తలెత్తుకోలేని పరిస్ధితి ఎదురై మానసిక వేదనకు గురవుతూ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా పంచాయితీలు పోలీస్టేషన్లలో కొనసాగుతున్నాయి.
నకిలీల మోసాలకు లక్షలు పొగొట్టుకున్న బాధితులు..
ఇదిలావుండగా గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు ఆకర్షితులై వేధింపులు తాళలేక పరువుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరోవైపు ఈ తరహా యాప్‌ల్లో కూడా నకిలీ వాటి బారిన ప డుతున్న ఎంతోమంది వేలు, లక్షలు వదిలించుకుంటున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ ఫైనాన్స్ కంపెనీల పేర్లతోనే నకి లీ కంపెనీలు కూడా దర్శనమిస్తున్నాయి. అసలు ఏవో.. నకిలీ ఏవో.. గ్రహించలేని చాలామంది యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని వారిచ్చే నిబంధనలన్నింటికీ ఒకే నొక్కడంతో వారి అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. కొన్ని యాప్‌ల నిర్వహకులు మాత్రం అడిగి మరీ కస్టమర్ల నుంచి ఆన్‌లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకుని మాయమవుతున్నారు. ఈ తరహా మోసానికి గురైన బాధితుడు విజయవాడ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
ఇండియన్ బుల్స్ పేరుతో ఉన్న నకిలీ యాప్‌ను గుర్తించలేని తుమ్మలచర్ల సాయిరాం అనే వ్యక్తి లక్ష రూపాయలు లోను మంజూరైనట్లు మెసేజ్ వచ్చింది. ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్ అప్‌లోడ్ చేసిన సాయిరాం తొలుత రూ. 4,500 ఆన్‌లైన్ పేమెంట్ చేశాడు. యాప్ నిర్వహకుల సూచనల మేరకు జిఎస్‌టి కింద రూ.10,000 లు చెల్లించాడు. ఇది కట్టడానికి ఆలస్యమైనందుకు లేట్ ఛార్జి కింద రూ.9,000 లు కట్టాడు. లోనులో మొదటి ఇఎంఐ కటింగ్ కింద మరో రూ.4,500లు చెల్లించాడు. ఇలా అతని వద్ద నుంచి సుమారు రూ.30వేల వరకు దోపిడీ చేశారు. ఆ తర్వాత నకిలీ యాప్ మోసాన్ని గ్రహించిన బాధితుడు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను కనిపెట్టేపనిలో ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహా మోసానికి గురై రూ.1.30లక్షలు పొగొట్టుకుంది. స్కూలు నిర్వహకురాలైన వెలగా శ్రీ వలి ్లకి పర్సనల్ లోన్ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయి. రూ.35లక్షలు మంజూరైందని, డాక్యుమెంటు ఛారీ ్జలు, ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్‌టి చెల్లిస్తే వెంటనే అకౌంటుకు రూ.35లక్షలు జమ అవుతాయని నమ్మించారు. దీంతో మోసపోయిన సదరు మహిళ గూగుల్ పే ద్వారా రూ.1,29,793 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత తాను మోసపోయినట్లు గుర్తెరిగి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
నిపుణులు ఏమంటున్నారంటే..
లోన్ యాప్‌ల బారిన పడి వేధింపులకు గురి కావద్దని, అదేవిధంగా నకిలీలను నమ్మి మోసపోవద్దని ఆర్ధిక నిపుణులు, పోలీసులు పదే పదే చెబుతున్నారు. వాస్తవానికి సుప్రీం కోర్టు ఎప్పుడో నిషేధించిన మైక్రో ఫైనాన్స్ లాంటివే ఈ లోన్ యాప్‌లని ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని సులభంగా అప్పులు ఇచ్చి వేధిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని అంటున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని ఈ అక్రమ యాప్‌లన్నింటి ని ప్రభుత్వం నిషేధించాలని అంటున్నారు. మరోవైపు నకిలీ యాప్‌లు సైతం జనానికి వివిధ కంపెనీల పేరుతో మెసేజ్‌లు పంపుతూ డబ్బు దోచుకుని మోసం చేస్తున్నాయని, ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టాలని అయితే ముందుగా ప్రజల్లో చైతన్యం రావాలని ‘ఎవ్వరూ ఉూరికే ఎవ్వరికీ డబ్బు ఇవ్వరని’ గ్రహించాలని హితవు చెబుతున్నారు.