తిరుపతి సిటీ (ప్రభ న్యూస్): తిరుపతిలో దారుణం జరిగింది. హతిరాంజి కాలనీలో హోటల్ నడుపుతున్న భార్యాభర్తలపై నలుగురు యువకులు తాగొచ్చి గొడవకు దిగారు. వారి నుంచి తప్పించుకుని వెళ్తుండగా వెంటపడి కాగితాలు మీద చల్లుతూ వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని హోటల్లో పనిచేసే వారికి తెలియజేయగా వారంతా వచ్చి ఘర్షణకు దిగిన యువకులను చితకబాదారు. ఈ క్రమంలో వారిలో ఒకతను చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతి హతిరాంజి కాలనీలో విజయ్ కుమార్ హోటల్ నడుపుతున్నాడు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో హోటల్ దగ్గర నుంచి భార్యాభర్తలు ఇంటికి వెళుతున్నారు. అయితే.. హోటల్ సమీపంలో మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన యువకులు మని, భార్గవ్, ప్రవీణ్, కన్నయ్య కలిసి హోటల్ యజమానులను వేధింపులకు గురిచేశారు. రామచంద్రపురం దగ్గర మద్యం తాగి, తిరుపతికి వచ్చారు.
ఆ తర్వాత అన్నమయ్య సర్కిల్ సమీపంలో హోటల్ దగ్గర ఆటో ఉంచారు. హోటల్ యజమాని విజయకుమార్, అతను భార్య ఇంటికి వెళ్తుండగా ఆటోలో ఇద్దరు యువకులు, బయట మరో ఇద్దరు ఉండి వారిని కదలకుండా అడ్డుకుంటే, వారిపై చిత్తు కాగితాలు చింపి చల్లడం చేశారు. దీన్ని ప్రశ్నించిన హోటల్ యజమానిపై ఆ యువకులు తిరగబడి, ఘర్షణ పెట్టుకున్నారు.
దీంతో హోటల్ యజమాని యువకులను అడ్డుకుంటూనే.. సమీప ప్రాంతంలో హోటల్ దగ్గరున్న వాళ్లకు సమాచారం అందించాడు. దీంతో హోటల్లో పనిచేస్తున్న వారంతా కలిసికట్టుగా వచ్చి ఆ యువకుల్ని చితకబాదారు. ఈ క్రమంలో మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నారాయణ కుమారుడు మనీ (25)పై హోటల్ యజమాని విజయకుమార్ దాడి చేస్తూ.. కోపంతో కర్రతో కొట్టాడు. అతనికి తీవ్ర గాయాలై అక్కడే చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న ఈస్ట్ సీఐ బీవీ శివప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ కాసుల శ్రీనివాసరావుతో పాటు బ్లూ కోర్ట్ సిబ్బంది వచ్చారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.