Tuesday, November 26, 2024

Hanuma Vihari | ఆ నెత వ‌ల్లే కప్టెన్సీ తప్పించారు.. ఇక ఆంద్ర జట్టుకు ఆడను

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి గత నెలలో ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ సమయంలో విహారి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నిజం ఇప్పుడు బయటపడింది.. హనుమ విహారి కెప్టెన్సీని వదులుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక ప్రకటనలో వివరించాడు.

‘‘అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన చేస్తున్నాను. ఈ రంజీ సీజన్‌లో బెంగాల్ జట్టుతో ఆంధ్రా జట్టు ఆడినప్పుడు నేను కెప్టెన్‌గా ఉన్నాను. గతేడాది రంజీ ఫైనలిస్ట్ అయిన బెంగాల్‌పై 410 పరుగులు చేసి గెలిచాం. అయితే, మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నేను ఆంధ్ర రంజీ జట్టు 17వ ఆటగాడిపై కోపంతో అరిచాను.. ఆ ఆటగాడు తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. క్రికెటర్ తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో నాపై చర్యలు తీసుకోవాలని క్రికెట్ సంఘంపై ఒత్తిడి తెచ్చాడు.

దీంతో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని చెప్పారు. నా తప్పు లేకపోయినా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్నారు. ఆ ఆటగాడి గురించి నేను వ్యక్తిగతంగా ఏమీ చెప్పలేదు. కానీ క్రికెట్ అసోసియేషన్ మాత్రం నాకంటే ఆటగాడే ముఖ్యమని భావించింది. గత ఏడాది ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసిన ఆటగాడి కంటే, గత ఏడేళ్లలో ఆంధ్రా జట్టును ఐదుసార్లు నాకౌట్‌కు తీసుకెళ్లిన ఆటగాడి కంటే ఆ ఆటగాడే క్రికెట్ సంఘానికి చాలా ముఖ్యం అయ్యాడు.

ఈ పరిణామానికి నేను చాలా బాధపడ్డాను. అయితే, నేను ఈ సీజన్‌లో ఆడటానికి కారణం క్రికెట్‌పై నాకున్న గౌరవం, నా జట్టుపై నాకున్న గౌరవం. క్రికెటర్లు తాము చెప్పింది వినాలని, వారి వల్లే క్రికెటర్లు జట్టులోకి ఎంపికవుతున్నారని క్రికెట్ అసోసియేషన్ భావించడం బాధాకరం. అందుకే, ఇక ఎప్పటికీ ఆంధ్రా టీమ్ కు ఆడ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నాను. నాకు గౌరవం లేని చోట నేను ఉండలేను. ఆ జట్టు అంటే నాకు ఇష్టమే, ప్రతి సీజన్ కు మేం ఎంతో మెరుగవుతూ వస్తున్నాం. కానీ మేం ఎదగడమే క్రికెట్ అసోసియేషన్ కు ఇష్టం లేనట్టుంది’’ అంటూ హనుమ విహారి తన ప్రకటనలో వివరించాడు.

గత సీజన్‌లో హనుమ విహారి రంజీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడుతున్నప్పుడు మణికట్టుకు గాయమైంది. కానీ జట్టు కోసం ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తూ తన పోరాట పటిమను చాటాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ, అతను గాయం కారణంగా ఎడమ చేతితో బ్యాటింగ్ చేశాడు. నాడు కెప్టెన్ గా హనుమ విహారి స్ఫూర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement