Friday, November 22, 2024

4 నుంచి ఒంటిపూట బడులు.. ఉదయం 7.30 నుంచి 11.30 వరకు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఒంటిపూట బడులపై సందిగ్దత వీడింది. రోజురోజుకూ ఎండలు పెరుగుతున్న నేపధ్యంలో ఒంటిపూట బడులను నిర్వహిస్తారా? లేదా? అనే సందేహాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సిలబస్‌ పూర్తికాకపోవడం వంటి పలు కారణాల నేపధ్యంలో ఒంటిపూట బడుల నిర్వహణలో జాప్యం జరిగింది. ఓ వైపు వేసవి తీవ్రత పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో పలువురు సందిగ్దానికి లోనయ్యారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

ఈ క్రమంలో ఒంటిపూట బడులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ స్పష్టత ఇచ్చారు. ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని మంత్రి సురేష్‌ తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సోమవారం నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30గంటల వరకు పాఠశాలలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 27 నుంచి పదో తరగతి, వచ్చే నెల 6నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement