Friday, November 22, 2024

విశాఖకు మరింత జోష్​.. కొత్త కొత్త ప్రాజెక్టులతో కొత్త అందాలు..

విశాఖపట్నం, ప్రభన్యూస్ : విశ్వనగరంగా ఖ్యాతిగాంచిన మహావిశాఖలో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు జీవీఎంసీ తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకోసం అవసరమైన ఆదాయం సమకూర్చుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. సొంతంగా విభాగాల నుంచి ఆదాయం సమీకరించుకోవడంతో పాటు అవసరమైతే ముఖ్య ప్రాజెక్టులకు రుణాలు కూడా సేకరించి ఆయా ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయాలన్నది గ్రేటర్‌ ప్రధాన లక్ష్యం. నగర మేయర్ హరివెంకటకుమారి, గ్రేటర్‌ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీ, తదితరులంతా ఆయా అభివృద్ధి పనులపై దృష్టి సారించారు.

ఈ ఏడాది బడ్జెట్‌ రూ.4029 కోట్లు..

మహావిశాఖనగరపాలక సంస్థ 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఇప్పటికే రూ.4029 కోట్లతో సిద్ధం చేసింది. ఇందులో ప్రధానంగా ఇంజనీరింగ్‌ పనులకు, ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపారు. ఆ తరువాత ప్రజారోగ్యం, విద్య, పార్కులు, లీజర్స్‌, సెమిట్రీస్‌, వార్డు అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారు. ఇక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరు కానున్న గ్రాంట్లను అంచనా వేశారు. ప్రధానంగా స్మార్ట్‌ సిటీ నిధులు, అటల్‌మిషన్‌ ఫర్‌ రెజూవ్‌ నేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్‌ మిషన్‌ (అమృత్‌)తో పాటు అనేక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. మరికొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది.

త్వరలో బీచ్‌కోత నివారణ పనులు..

ఇటీవల కాలంలో తరచూ సముద్రతీర ప్రాంతం కోతకు గురవుతుంది. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, విశాఖ సాగరతీరంలో అండర్‌ కరెంట్‌ అధికంగా ఉండడం, ఆపై ఆటుపోట్లు వల్ల అలలు తాకిడి కొన్ని సమయాల్లో అధికంగా ఉండడం వల్ల తరచూ తీర ప్రాంతం కోతకు గురవుతుంది. ఈ నేపధ ్యంలోనే చెన్నైకి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓసినో గ్రఫీ టెక్నాలజీ సంస్థ, నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారేస్‌ సంస్థలు ఇందు కోసం సవివర ప్రాజెక్టు నివేధిక సిద్ధం చేస్తున్నాయి.

- Advertisement -

ఎలేశ్వరం నుంచి తాళ్లపాలెం వరకు పైపులైన్‌..

ఇక నగరానికి నిరంతరం నీరందించేందుకు ఏలేశ్వరం జలాశయం నుంచి తాళ్లపాలెం వరకు శాశ్వత మంచినీటి పైపులైను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సానుకూలంగా స్పందించింది. సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. సుమారు రూ.3500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు డిపిఆర్‌ తయారు చేస్తున్నారు. మరో 15 రోజుల్లో సవివర ప్రాజెక్టు నివేధిక సిద్ధం కానుంది.

ప్రతీ వార్డుకు మాస్టర్‌ ప్లాన్‌..

తాజాగా 98 వార్డులకు సంబంధించి ప్రత్యేకంగా వార్డు మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయిస్తున్నారు. వీటి ద్వారా ప్రతీ వార్డులోనూ ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించనున్నారు. ఈ ప్లాన్‌లో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేస్తున్నారు. వారు ఎంపిక చేసిన ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పూర్తి చేయనున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రతీ వార్డులో అభివృద్ధి పనులకు కోటిన్నర చొప్పున నిధులు కేటాయించారు. త్వరలోనే అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.

కాఫీవిత్‌ కార్పొరేటర్‌తో సమస్యలు గుర్తింపు..

జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీ శ ఇటీవలే వినూత్నంగా కాఫీవిత్‌ కార్పొరేటర్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ హరివెంకటకుమారితో పాటు అన్ని జోన్ల అధికారులు, కార్పొరేటర్లను మమేకం చేసి వార్డుల్లో చిన్న చిన్న సమస్యలను సైతం గుర్తిస్తున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలకు దశల వారీగా పరిష్కారం చూపే కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు జోన్లులో కాఫీవిత్‌ కార్పొరేటర్‌ కార్యక్రమం ముగిసింది. మిగిలిన జోన్‌లలో త్వరలో పూర్తి చేయనున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement