Tuesday, November 19, 2024

Delhi | సైనికుల ఆరోగ్య అవసరాలపై జీవీఎల్ చొరవ.. ఎంపీ లాడ్స్ తో సైనిక భ‌వ‌న్‌ నిర్మాణం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలో సైనిక్ భవన్, సైనిక్ రెస్ట్ హౌజ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విశాఖలో సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాల కోసం తన ఎంపీలాడ్స్ నిధులు ఇస్తాననని జీవీఎల్ తెలిపారు. సాగరతీరంలో సైనిక్ భవన్, సైనిక్ రెస్ట్ హౌజ్ నిర్మాణం ఎంతో అవసరముందని చెప్పారు. విశాఖ తూర్పు నౌకాదళ కమాండ్‌కు ప్రధాన కార్యాలయమని, అక్కడ ఎక్కువ మంది మాజీ సైనికులు నివసిస్తున్నారని, వారికి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని జీవీఎల్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం (జిల్లా సైనిక బోర్డు) కనీస సౌకర్యాలు కూడా లేని శిథిలావస్థ భవనంలో ఉందని, కనీసం సైనిక విశ్రాంతి గృహం కూడా లేదని, సమీపంలోని జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది మాజీ సైనికులు చికిత్స కోసం అక్కడికి వెళుతున్నారని ఆయన వివరించారు. మాజీ సైనికుల అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని విశాఖలో పూర్తి స్థాయి సైనిక్ భవనం, సైనిక్ విశ్రాంతి గృహం నిర్మాణానికి భూమి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

43 వేల మంది ఈఎస్‌ఐ కార్డ్ హోల్డర్లు, వారిపై ఆధారపడిన వారికి సేవలందించేందుకు విశాఖపట్నంలోని మాజీ సైనికులకు ప్రస్తుతం ఉన్న వైద్య సౌకర్యాలు సరిపోవడంలేదని, మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడానికి మరో పాలీక్లినిక్‌ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న పాలీక్లినిక్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఎంపీ జీవీఎల్ అభ్యర్థించారు. సైనికులు, మాజీ సైనికుల అవసరాలను తీర్చడానికి, ఎంప్యానల్డ్ ఆసుపత్రులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి విశాఖలోని కళ్యాణి హాస్పిటల్‌ను 206 పడకల నుంచి 604 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కూడా ఆయన కేంద్రమంత్రిని కోరారు.

భవనాల నిర్మాణం, మాజీ సైనికుల అవసరాలకు మొబైల్ పాలీ క్లినిక్ వ్యాన్‌లను కొనుగోలు చేయడానికి రూ.50 లక్షలు అందించడానికి జీవీఎల్ నరసింహారావు ముందుకొచ్చారు. అవసరమైతే కొంతమేర సీఎస్‌ఆర్‌ నిధులను కూడా సమీకరించుకోవచ్చని ఆయన రక్షణమంత్రికి రాసిన లేఖలో తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం తర్వాత జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ… తన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పించారని, త్వరలోనే అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement