Saturday, November 23, 2024

జోరుగా గుట్కా వ్యాపారం… బైకులు, ఆర్టీసీ బస్సుల్లో తరలింపు…

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్ : తిరుపతి నగరంలో మూడు పూలు ఆరు కాయలు గా గుట్కా వ్యాపారం జోరుగా జరుగుతోంది.. పోలీసులు తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వ్యాపారులు గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారు. గుట్కా వినియోగం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు విజృంభిస్తున్నా.. వినియోగదారులు వెనకడుగు వేయడం లేదు. తిరుపతి నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు దుకాణాల్లో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. దానికి తోడు గంజాయి. ఇతర రాష్ట్రాల మద్యం జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. నగరంలో గుట్కా వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం పై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేసినా నిషేధిత గుట్కా వ్యాపారం గురించి పట్టించుకోకపోవడంతో వినియోగం బాగా పెరిగింది.. అధికారుల కళ్లుగప్పి వ్యాపారస్తులు గుట్కా సంచులను బెంగళూరు నుంచి పార్సల్ వాహనం, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సుల ద్వారా తిరుపతి నగరానికి తీసుకువచ్చి వ్యాపారం సాగిస్తున్నారు.. తిరుపతి నగరంలో కాలనీలో సైతం గుట్కాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. గుట్కాల వ్యాపారాన్ని అడ్డుకోవాలని పలువురు పోలీసు అధికారులను ప్ర‌జ‌లు కోరుతున్నారు.
పట్టుబడిన గుట్కాలు వివరాలు :
తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్ లో 40 వేల రూపాయలు విలువైన గుట్కాలను ప‌ట్టుకున్నారు. అశోక్ నగర్ కు చెందిన శివ శంకర్ రెడ్డి గత కొంతకాలంగా గుట్కాల అమ్మకాలు సాగిస్తున్నారు. నిందితున్ని ఈస్ట్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అలాగే అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణపురం అన్నమయ్య నగర్. ఎస్.ఎన్. పురంకు చెందిన నిందితుడు వెంకటేష్ పట్టుకొని 5,12,100 రూపాయలు విలువ గలిగే 39 గోని సంచులు. 25 బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
యువతను చైతన్యం చేయాలి :
గుట్కాల వినియోగానికి వ్యతిరేకంగా యువకులను చైతన్యవంతం చేయాలి. నగరంలో ప్రచారం చేయాలి.. పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థలు యువకులను కాపాడాలని, క్యాన్సర్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement