న్యూ ఢిల్లీ – ఎపిలో జగన్ సర్కారు అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, ఓ మహిళ ఏకంగా తన బొటనవేలును కోసుకుని నిరసన తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. వారిని కలవడం వీలుకాకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన బొట. వేలును నరుక్కుంది. ఈమేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వీడియోలోని వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు అంతులేకుండా పోయిందని ఆమె చెప్పారు. మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను, భూములను కాజేయడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరించడం నిత్యకృత్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటినీ రాష్ట్రం, దేశం, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రెసిడెంట్, సీజేఐ, ప్రధాన మంత్రిని కలవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదని వివరించారు. దీంతో వారి ఆఫీసులలో వినతిపత్రాలు అందజేసి, తన వేలును కోసుకోవడం ద్వారా నిరసన తెలుపుతున్నానని చెప్పారు. తాను చేసిన పనికి అందరూ క్షమించాలంటూ కోపూరు లక్ష్మీ వీడియోలో కోరారు.
మీరూ వేలు కోసుకుంటే స్పందిస్తారా….నారా లోకేష్
జగన్ పాలనను నిరసిస్తూ లక్ష్మి వేలు నరుక్కున్న ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ,
వైసీపీ అవినీతి, అక్రమాలపై కోవూరు లక్ష్మి ఢిల్లీలోనూ పోరాడుతున్నారని తెలిపారు. సొంత బాబాయ్ ను చంపినవారు… మీరు వేలుకోసుకుంటే స్పందిస్తారా? అని కోవూరు లక్ష్మిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా, నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ఇలాంటివి వద్దు అని లోకేశ్ స్పష్టం చేశారు.