ఫారిన్ సంబంధం.. కుర్రాడు చక్కగా ఉన్నాడని ఓ తండ్రి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు. అంతేకాకుండా కట్నం కింద రూ.10 లక్షలు కూడా ఇచ్చాడు. కానీ అంతలోనే ఆ కుర్రాడు తేడా అని తేలిపోయింది. తాను గే అని చెప్పకుండా పెళ్లి చేసుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భర్తపై ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఓ యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4న పెళ్లి జరిగింది. సదరు యువకుడు ఉద్యోగ రీత్యా కెనడాలో పనిచేస్తుంటాడు. దీంతో అతడికి రూ.10 లక్షల కట్నంతో పాటు లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. కానీ శోభనం రోజు రాత్రి గదిలోకి అడుగుపెట్టిన యువతి షాక్ తింది. ఎందుకంటే సదరు యువకుడు తాను ‘గే’అని, తనకు ఆడవాళ్లు అంటే ఇష్టం ఉండరని చెప్పాడు. ఇంట్లో వాళ్లు బలవంతం చేయడంతో పెళ్లి చేసుకున్నానని, ఈ విషయం బయట చెప్పవద్దని కోరాడు. మరుసటి రోజు విజయవాడలో రిసెప్షన్ ఉండటంతో వధువు తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పేసింది. దీంతో వధువు బంధువులు వరుడి కుటుంబంపై దాడి చేశారు. దీంతో రిసెప్షన్ ఆగిపోయింది.
అనంతరం ఇరుకుటుంబాల మధ్య సంప్రదింపులు జరగ్గా.. వరుడు కుటుంబీకులు తాము రిసెప్షన్ కోసం ఖర్చు చేసిన రూ.8 లక్షలు ఇవ్వాలని వధువు కుటుంబీకులను డిమాండ్ చేశారు. ఈ విషయమై వరుడు కుటుంబీకులు ఆగ్రహం చెంది పలుమార్లు వధువు కుటుంబంపై దాడి చేశారు. దీంతో వధువు కుటుంబీకులు తెనాలి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ తతంగంపై విచారణ చేపట్టారు.