Tuesday, November 26, 2024

వాలంటీర్ నిబద్ధత – కరోనా బాధితుడిని వెతుక్కుంటూ వెళ్లి పెన్షన్ అందజేత

గుంటూరు కరోనా బాధితుల బాధలు వర్ణనాతీతం. సామాజిక అంటరానితనాన్ని వారు అనుభవిస్తున్నారు. అయినవారే వారిపట్ల అంతులేని వివక్ష ప్రదర్శిస్తుండటం మనం నిత్యం చూస్తూనే వున్నాం. కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూస్తే కడసారి చూపుకు కన్నవారు, కట్టుకున్న వారు సైతం వెళ్లని సంఘటనలు అనునిత్యం మనకు తారసపడుతూనే వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో ఒక వాలంటీర్ చూపిన నిబద్ధత నిజంగా ఎంతో అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం వారిమీద పెట్టుకున్న ఆశలకు ఆ వాలంటీర్ నిదర్శనం గా నిలిచారు.
కరోనా బారిన ఒక వృద్ధుడు మంగళగిరి వద్దనున్న ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వృద్ధుడు ప్రతినెలా పెన్షన్ పొందుతున్నారు. అనారోగ్య కారణంగా అందుబాటులో లేక పోవటం తో ఆ వృద్ధుడు గత మూడునెలలు గా పెన్షన్ తీసుకోలేక పోయారు. ఇంతలోనే మళ్లీ ఒకటో తారీఖు వచ్చింది. పెన్షన్ తీసుకోవలసిన సమయం. ఈ నెలలోనే పెన్షన్ తీసుకోకపోతే ఇక ఆ వృద్దునికి పెన్షన్ రద్దు అవుతోంది. ఇది గమనించిన ఆ గ్రామ వాలంటీర్ వృద్ధుని గురించి ఆరా తీశారు. చివరకు కరోనా సోకి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని తెలుసుకొని అక్కడకు వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు పరిస్తితి వివరించి ఆ వృద్ధుని కలిసేందుకు అనుమతి పొందారు. ఆక్సిజన్ మాస్క్ తో చికిత్స పొందుతున్న ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి ప్రభుత్వ పెన్షన్ ను అందజేసి, ఆ విషయాన్ని బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసుకున్నారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం చూపటంతో పాటు, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మానవతా దృక్పథంతో వ్యవహరించిన ఆ వాలంటీర్ ను పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement