గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులోని రీజినల్ సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు దేవినేని ఉమ, కోవెలమూడి రవీంద్ర, బుచ్చి, రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు, సుఖవాసి, కనపర్తిలను అరెస్టు చేశారు. దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ .. ఎమ్మెల్సీ అశోక్‌బాబును కలిసేందుకు సీఐడీ అధికారులు అనుమతించాలని కోరారు.
గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగానే ఎమ్మెల్సీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారేమోనన్న అనుమానాలను వ్యక్తం చేశారు. అశోక్‌బాబును అర్ధరాత్రి తీసుకొచ్చి దాడి చేస్తారా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా సీఐడీ కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పాత కేసులను తిరగదోడి అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..