తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ విషయంతో తలెత్తిన వివాదం ముదురుతోంది. ఇప్పటికే నదీ జలాల కోసం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగా అదిప్పుడు చేతల వరకు వెళ్లింది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో గల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్‌లో తెలంగాణ భూభాగంలోకి రాకుండా ఏపీ అధికారులను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపించారు. విద్యుదుత్పత్తిని ఆపాలని వినతిపత్రం ఇచ్చేందుకు ఏపీ అధికారులు వస్తుండగా నూతన వంతెన వద్ద అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఎస్‌పీ ఎస్ఈలు పురషోత్తం, గంగరాజు, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, గురజాల ఆర్డివో పార్ధసారధి, గురజాల డీఎస్పీ ప్రసాద్‌ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రం వద్దకు అనుమతి ఇవ్వాలని… వినతిపత్రం ఇచ్చి వెనక్కి వస్తామని కోరినా తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక ఏపీ అధికారులను వెనక్కి వెళ్లిపోయారు.
అనంతరం గురజాల ఆర్డీవో పార్థసారధి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారుల బృందాన్ని సరిహద్దు వద్ద నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. నాగార్జునసాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి ఆపమని ఏపీ ప్రభుత్వం తరఫున తెలంగాణ అధికారులకు వినతి పత్రం ఇద్దామని వెళ్తే తెలంగాణ పోలీసులు అనుమతించలేదన్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నాగార్జున సాగర్ డ్యాం లో నీళ్లు తక్కువగా ఉన్నాయని… వ్యవసాయ సీజన్ కు సాగునీరు అందించకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. సాగర్ డ్యామ్ వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయటం వలన నీరు సముద్రంలో కలసిపోయి ఉపయోగం లేకుండా పోతుందన్నారు. సాగర్ డ్యాం వద్ద నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని ఆర్డీవో పార్థసారధి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న జలవివాదం.. జూరాల మీదుగా రాకపోకలు నిషేధం