అమరావతి: అక్రమాలు జరిగాయనే తెలిసినా తిరిగి యదాతధంగా జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను నిరసిస్తూ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు..పరిషత్ ఎన్నికలపై నేటి ఉదయం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పొలిట్ బ్యూరో సుదీర్ఘంగా చర్చించారు.. మెజార్టీ సభ్యులు ఎన్నికల బహిష్కరణకే మొగ్గు చూపారు.. తుది నిర్ణయాన్ని పొలిట్ బ్యూరో చంద్రబాబుకే వదిలివేసింది.. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త ఎస్‌ఈసీ వచ్చిరాగానే నిర్ణయం తీసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్‌ఈసీకి ఉందా అని నిలదీశారు. పరిషత్ ఎన్నికల్లో ఎస్‌ఈసీ రబ్బర్‌స్టాంపుగా మారారని ఆరోపించారు. 2014లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే తాజా ఎన్నికల్లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 2014లో 1శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవమైతే ఈసారి 19శాతం అయ్యాయని గుర్తు చేశారు. అధికార వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని మండిపడ్డారు.పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. గత ఎన్నికల కమిషనర్ ఫిర్యాదుతో బోనులో నిలుచున్న నీలం సాహ్ని ఇప్పుడు కమిషనర్ గా వచ్చారని, రావడంతోనే ప్రభుత్వం చెప్పినట్లుగానే నోటిఫికేషన్ విడుదల చేశారని ఫైర్ అయ్యారు. పరిషత్ ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయాని గత ఎన్నికల కమిషనర్ కేంద్ర హోం శాఖకు, రాష్ట్ర గవర్నర్ కు లేఖలు రాసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అ అవతవకలను పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం తప్పని పేర్కొన్నారు. . తాజా పరిస్థితుల్ని బేరీజ్ వేసుకున్న తర్వాతే ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు.. తామేమి ఎన్నికలకు భయపడటం లేదని, అలాగే ఎన్నికలకు తాము కొత్త కాదని చంద్రబాబు పేర్కొన్నారు. పోటీ చేస్తామంటే బెదిరిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరించి ఓట్లేయించుకున్నారని, ప్రశ్నిస్తే ఎర్రచందనం ఇళ్లలో పెట్టి కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి కుర్చీ మాత్రమే కావాలని, ప్రజా సంక్షేమం, ప్రజల ఆరోగ్యం పట్టదని విమర్శించారు.. సెకండ్ వేవ్ కరోనా విజృభిస్తున్న దశలో ఎన్నికల నిర్వహణ ఏమిటని ప్రశ్నించారు.. ఎన్నికల బహిష్కరణపట్ల బాధ, ఆవేదన ఉందని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో దివంగత సీఎం జయలలిత, మాజీ సీఎం జ్యోతి బసు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారని గుర్తు చేశారు. తన జీవితంలో ఇంత కఠిన నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై జాతీయస్థాయిలో పోరాడతామని చంద్రబాబు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement