Tuesday, November 26, 2024

శేషవాహనంపై దర్శనమిచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి….

గుంటూరు కల్చరల్, – శ్రీకంచి కామకోటి పీఠ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి శేషవాహనా రూఢుడై భక్తులకు ఆశీస్సులు అందజేశారు. బ్రహ్మోత్సవాల విశేషపూజలు కార్యక్రమాలలో భాగంగా ఉదయం నిత్య పూజలతో పాటు అగ్ని ధ్యానం , నిత్య హోమం , సాయంత్రం ఏడు గంటలకు స్వామివారిని విశేషంగా అలంకరించి శేష వాహనంపై గోవిందనామ స్మరణతో తిరువీధులలో ఊరేగించారు. కార్యక్రమాలలో శ్రీవెంకటేశ్వర మహామంత్ర హోమం వేద మంత్రాల నడుమ విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభాకార్యక్రమాలలో గుంటూరు శ్రీశృంగేరీ శ్రీవిరూపాక్ష పీఠాధిపతి శ్రీగంభీరానంద భారతీ స్వామి పాల్గొని భక్తులకు పలు ఆధ్యాత్మిక విషయాలతోపాటు సంధ్యావందనం ద్వారా చేకూరే ఆరోగ్య వివరాలను చక్కగా అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ ముఖ్య అతిధులుగా పాల్గొని దేవాలయ పాలకవర్గం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి ఉపన్యాసకులుగా, డీ.ఎస్.పీ. గోలి లక్ష్మయ్య ఆధ్యాత్మిక వ్యాఖ్యానం చేశారు. వెంపటి సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీషిర్డీ సాయి సేవాసమితి, తెనాలిచే నిర్వహించిన భక్తి సంగీత విభావరి భక్తులను అలరించింది. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సి.హెచ్. మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి సభాకార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా మస్తానయ్య మాట్లాడుతూ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు హనుమత్ వాహన సేవ, సాయంత్రం గరుఢ వాహన సేవ విశేషంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను ఆలయపాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement