ఏఎన్యూ క్యాంపస్, (ప్రభ న్యూస్): ప్రతిరోజు పని ఒత్తిడితో విధుల్లో నిమగ్నమయ్యే రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఏ జి సాయిప్రసాద్ అన్నారు. ఆచార్య నాగార్జున విద్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ఆరవ రాష్ట్ర రెవెన్యూ క్రీడా – సాంస్కృతిక ఉత్సవాలను ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు క్రమం తప్పకుండా క్రీడా ,సాంస్కృతిక పోటీల్లో పాల్గొనాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఉద్యోగులకు క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమం అన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన అంతర్జాతీయ షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారిని , ఒలంపియన్, డిప్యూటీ కలెక్టర్ పివి. సింధు మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములు సర్వసాధారణమని, ఒత్తిడిని జయించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పారు. మూడు రోజులు పాటుగా జరిగే క్రీడా సాంస్కృతిక పోటీలను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.