వట్టిచెరుకూరు, : కరోనా సెకెండ్ వేవ్లో పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కరోనాపై అవగాహన పెంచుకుని ముందుకెళ్లడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను నియంత్రించాలంటే స్వీయ జాగ్రత్తలు తీసుకోవడమే అత్యుత్తమ రక్షణ మార్గమని చెబుతున్నారు. అనవసర భయాలకు పోకుండా అవగాహనతో సరైన రక్షణ చర్యలు పాటించాలి. అన్ని శ్వాసకోశ వ్యాధుల్లో లాగానే కరోనాలో కూడా సాధారణ జ్వరాల్లాంటి ఫ్లూ లక్షణాలే ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాసలో ఇబ్బంది, గొంతులో గరగర, ఆయాసం, వాసన గ్రాహక లోపంవంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ లక్షణాలు గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనేది ముందుగా అందరూ తెలుసుకోవాలి.
వ్యాయామం..సమతులాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాల పాటు నడక, జాగింగ్, యోగా వంటి శారీరక వ్యాయామం చేయాలి. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే సమతులాహారం తీసుకోవాలి. సీజనల్ పండ్లతో పాటు సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, దానిమ్మ, జామ, బత్తాయిలను అధికాంగా తీసుకోవాలి. పాలు, పండ్లు, మాంసం, చేపలు, పప్పుదినుసులు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వేడి చేసిన గోరు వెచ్చని పాలలో అరస్పూన్ పసుపు కలిపి తాగాలి.
ఇవి పాటించాల్సిందే..
భౌతికదూరం పాటించాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించాలి. ఇంటికి వచ్చాక చేతులను శానిటైజ్ లేదా సబ్బుతో కడుక్కోవాలి. ఇక సమూహాలకు దూరంగా ఉండాలి. తెలిసినవారైనా సరే కరచాలనం చేయకూడదు. బయట ఉన్నప్పుడు చేతి వేళ్లను ముక్కులో, నోటిలో తరచుగా పెట్టుకోవడం, కళ్లనురుద్దుకోవడం వంటివి చేయొద్దు. అనుమానిత లక్షణాలు ఉన్న వారు భయాందోళనలు చెందకుండా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చిన ఫలితాలను బట్టి వైద్యులను సంప్రదించడం మేలు. స్వల్ప లక్షణాలున్న వారు అప్పుడప్పుడు పొడి దగ్గు ఉంటుంది. కొద్దిగా గొంతునొప్పి కూడా ఉండొచ్చు. ఆక్సిజన్ స్థాయి రక్తంలో 85 శాతం, అంతకంటే ఎక్కువ శాతం ఉంటుంది.
ఆయాసం ఏమీ ఉండదు. వీరు కూడా 10 రోజులు హోం ఐసోలేషన్లో ఉండాలి. మరో 7 రోజులు ఇంటి నుంచి బయటకు రాకూడదు.
పూర్తి లక్షణాలు ఉన్న వారు..
కరోనా పాజిటివ్ వంటి లక్షణాలు ఉన్న వారిలో జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది.
తరుచూ పొడి దగ్గు, గొంతు నొప్పి ఉంటాయి. వణికిపోవడం, దగ్గు ఆగకుండా వస్తుండటం, క్రమేణా
ఎక్కువ కావడం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉండడం నీరసం పెరిగి నిశత్తువా అవహించడం, ఆయాసం ఎక్కువ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే హాస్పటల్లో చేరాలి.
ధైర్యంగా ఉండాలి..
జలుబు, దగ్గు, జ్వరం వంటివి సహజంగానే వస్తుంటాయి. అన్నీ కరోనా లక్షణాలే అనుకుని భయపడొద్దు. ధైర్యంగా ఉండాలి. 4, 5 రోజులు జ్వరం, పొడిదగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే, ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు సరైన చికిత్స తీసుకుంటే సులువుగా కోలుకుంటారు.
- డాక్టర్ కె వి నాగిరెడ్డి,
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కాట్రపాడు