అమరావతి: పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచి ఎపిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు..పరిషత్ ఎన్నికలపై విజయవాడలోని తన కార్యాలయంలో నేడు అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.. అయితే ఈ సమావేశాన్ని సిపిఐ, టిడిపి,బిజెపి, జనసేనలు బహిష్కరించాయి.. వైసీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ, సీపీఎం నుంచి వైవీ రావు, టీఆర్ఎస్ నుంచి ఆదినారాయణ సమావేశానికి హాజరయ్యారు. వైసిపి మినహా సమావేశానికి హాజరైన ఇతర పార్టీ ప్రతినిధులు పరిషత్ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు.. ఈ ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. అఖిలపక్ష సమావేశం అనంతరం నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ, ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకున్నాక పరిషత్ ఎన్నికల నిర్వహణపై సమీక్షించామని తెలిపారు. అంతా సమీక్షించిన తర్వాతే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. గతంలో ఆగిన ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచి ఎన్నికల నిర్వహణకు సన్నద్దంగా ఉన్నామని చెప్పిన మీదట నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిందని,ఇంకా జాప్యం జరగడం మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ వ్యవస్థే ఇప్పుడూ పని చేస్తోందని ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని నీలంసాహ్ని పేర్కొన్నారు. కాగా, అఖిలపక్ష సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు తెలిపామని సీపీఎం నేత వైవీ రావు వెల్లడించారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు జరిగిన చోట ఎన్నికలు ఆపాలని గతంలో ఎస్ఈసీని కోరామన్నారు. నిష్పక్షపాతంగా, అక్రమాలు లేకుండా ఎన్నికలు జరపాలని కోరామన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆచరణ చాలా ముఖ్యమని చెప్పామన్నారు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరామని వైవీ రావు పేర్కొన్నారు.. అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ, పాత నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
నేటి నుంచి ఎపిలో ఎన్నికల కోడ్ – పారదర్శకంగా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తాంః నీలం సాహ్ని
Advertisement
తాజా వార్తలు
Advertisement