గుంటూరు కల్చరల్, ఫిబ్రవరి 19(ప్రభన్యూస్) : 12వ అఖండ సంగీతార్చన సంగీత వాద్య నృత్య సమ్మేళనంతో సుసంపన్నమైనది. మహాశివరాత్రి ని పురస్కరించుకొని స్థానిక బ్రాడీపేట శ్రీభారతీ సంగీత నిలయం వ్యవస్థాపకులు వీణ గాన ప్రపూర్ణ ఎ. భారతీదేవి ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం కళావేదికపై శనివారం ప్రారంభమైన 12వ అఖండ సంగీతార్చన ఆదివారం ఉదయం సుసంపన్నమైంది. రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలలో దేవిగాన ప్రపూర్ణ భారతీ దేవి వారి శిష్య బృందంతో నిర్వహించిన వీణ త్రయంలో అనేక వాగ్గేయకార కృతులను శ్రావ్యంగా వీణపై పలికించి ప్రేక్షకులను అలరించారు.
రుద్రకళాపీఠం వ్యవస్థాపకులు నాట్యాచార్యులు రాజేష్ నిర్వహించిన కూచిపూడి నృత్యం, శివ స్తుతి, లింగోదోద్భవ సమయంలో శివ స్తుతితో విశేష అభిషేకం అర్చన నిర్వహించారు. ఆదివారం ఉదయం అనేక మంది కళాకారుల సంగమంతో విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు తిరుప్పావై అమృతవర్షిణి కోగంటి వెంకట రంగనాయకి, డాక్టర్ రామరాజు శ్రీనివాస్ దంపతులు భారతి దేవి సంగీత సేవలను కొనియాడుతూ, పుష్కర కాలంగా అఖండ సంగీతార్చన నిర్వహించటం ఒక సంచలనం అన్నారు. భారతీదేవి కళాకారులను, అతిధులను ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు ఎ.భారతీ దేవి ఉమా మహేశ్వరులకు విశేష హారతి అందించి ప్రసాద వితరణతో కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. కార్యదర్శి దుద్దుకూరి శ్యామసుందర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.