మంగళగిరి రూరల్: ఫిబ్రవరి 17 ప్రభ న్యూస్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా రూ.21 వేల వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ ఎస్ చెంగయ్య డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు, పెద్దవడ్లపూడి, నూతక్కి, కాజా, చినకాకాని, నిడమర్రు, బేతపూడి, నవులూరు, ఎర్రబాలెం గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులు కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ గ్రామాల్లో పన్నులను కార్పొరేషన్ స్థాయిలో వసూలు చేస్తూ… కార్మికుల జీతాలు మాత్రం పంచాయతీ స్థాయిలో చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే పట్టణం లో కార్మికులకు చెల్లిస్తున్న విధంగా విలీన గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా రూ 21 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న క్రమం లో వారికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలన్నారు. సబ్బులు, కొబ్బరి నూనె, యూనిఫామ్ ఇవ్వకుండా తాత్సారం చేయడం తగదన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో రెండు నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పిఎఫ్ అకౌంట్ అన్నింటిని మెర్జ్ చేసి ఒకే ఖాతాకి జమ చేయాలని, తొలగించిన 100మంది బదిలీ కార్మికులు తీసుకోవాలని, సీఎం ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకునేలా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, డ్రైవర్లకు కూడా హెల్త్ అలవెన్స్ రూ.6వేలు ఇవ్వాలని, అన్ని రకాల సెలవులను వారికి వర్తింప చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రవి, ఎం భాగ్యరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాచూరి వేణు, కార్పొరేషన్ సంఘ అధ్యక్షులు వెంగమ్మ, ఎర్రబాలెం నాయకులు తోకల బాబు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement