Monday, November 25, 2024

ఆరు రోజుల ఎన్నిక‌ల‌కు వ్యాక్సిన్ సాకు – నిమ్మ‌గ‌డ్డ‌పై స‌జ్జ‌ల విమ‌ర్శ‌

అమ‌రావ‌తి – ఆరు రోజుల్లో పూర్తి అయ్యే పరిషత్‌ ఎన్నికలకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యాక్సిన్‌ను సాకుగా చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్‌ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని తెలిపారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ‘కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసమని ఆనాడు ఎన్నికలు వాయిదా వేయమన్నామని ఎస్‌ఈసీని కోరాం..అప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వినలేదు..ఇప్పుడేమో 6 రోజుల్లో పూర్తయ్యే ఎన్నికకు వ్యాక్సిన్‌ సాకు చెబుతున్నారని’ పేర్కొన్నారు. తాము ఈ 6 రోజుల్లో ఎన్నిక పూర్తి చేసి ..కోవిడ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. రానున్న ఎస్‌ఈసీని కూడా మేం అదే కోరతామని స్పష్టం చేశారు. కోవిడ్‌ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో కోటి మందికి వ్యాక్సినేషన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగా చాలా చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆనాడు చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన పనికి ఆ రోజే హోదా డిమాండ్‌ సగం చచ్చిపోయిందన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలా పోరాడతామని చెప్పారు. చంద్రబాబులా దొంగాట ఆడం..పోరాటం చేస్తునే ఉంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement