మంగళగిరి ఫిబ్రవరి 19: ప్రభ న్యూస్- మంగళగిరిలో శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల దివ్య రథోత్సవం ఆదివారం అత్యంత కన్నుల పండువగా జరిగింది. మంగళగిరి నగరంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష జనవాహిని జయ జయ ధ్వానాల నడుమ మల్లేశ్వరుని రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళగిరి నగరం శివనామస్మణతో మార్మోగింది. మంగళాద్రి క్షేత్రంలో రెండు వైష్ణవ ఆలయాల మధ్య వేంచేసియున్న శివాలయానికి చెందిన ఈ రథాన్ని చిన్నరథంగా పిలుస్తుంటారు. శివాలయం ఆవరణలో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల కల్యాణం నిర్వహించారు.
కల్యాణోత్సవం అనంతరం ఆదివారం ఉదయం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన నంది వాహనంపై ఊరేగించారు. ఆదివారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల కల్యాణమూర్తులను దివ్య రథంపై అధిష్టింపజేశారు. రథోత్సవం ఎటువంటి అపశృతులు లేకుండా సాఫీగా సాగిపోవాలని కోరుతూ అన్నపు రాశిని బలిహారణ చేశారు. శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్‌కుమార్‌శర్మ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి. శివాలయం వద్ద నుంచి ప్రారంభమైన రథోత్సవం మెయిన్ బజారు మీదుగా ఆంజనేయస్వామి మిద్దె సెంటరును చేరుకుంది. అక్కడ స్వామివార్ల రాక కోసం పెద్ద ఎత్తున వేచి వున్న భక్తులు టెంకాయలు సమర్పించి హారతులు పట్టారు.
రథాన్ని లాగేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రధాన వీధి అంతా భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. హర హర మహాదేవ శంభో శంకర అంటూ యువత ఉత్సాహంగా రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన గంజి చిరంజీవి, తహసీల్దారు జీవీ రామ్‌ప్రసాద్, అర్బన సీఐ బి.అంకమ్మరావు, పలువురు ప్రముఖులు, ఇతర అధికారులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం ఇనచార్జి ఈవో ఎ.రామకోటిరెడ్డి, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.