నడుము భాగంలో మూడో కాలుతో పుట్టిన శిశువు…
చరిత్ర సృష్టించిన ఆస్పత్రి జిజిహెచ్ న్యూరో సర్జరీ వైద్యులు…
అరుదైన ఆపరేషన్ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన జిజిహెచ్ వైద్యులు..
ప్రపంచ వ్యాప్తంగా 22వ ఆపరేషన్ గా రికార్డ్…
దేశంలోనే తొలి శస్త్ర చికిత్స చేసినా ప్రభుత్వ ఆస్పత్రిగా జిజిహెచ్ న్యూరో సర్జరీ విభాగం
గుంటూరు మెడికల్ – ఓ ఆడ శిశువు కు అరుదైన శస్త్ర చికిత్స చేశారు గుంటూరు సర్వ జన ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం వైద్యులు. ఈ శస్త్ర చికిత్స ను న్యూరో సర్జరీ రెండో విభాగం అధిపతి ప్రొఫెసర్ డి శేషాద్రి శేఖర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ భవనం హనుమ శ్రీనివాస రెడ్డి , పిజి లు డాక్టర్ ధీరజ్, డాక్టర్ సత్య, డాక్టర్ విజయ్ లు విజయవంతం చేశారు. న్యూరో సర్జరీ విభాగంలో జరిగిన శస్త్ర చికిత్స సంబంధించి వివరాలను మంగళవారం డాక్టర్ శేషాద్రి శేఖర్, డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డివెల్లడించారు.పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారి గూడెం కు చెందిన కూలి పనులు చేసుకునే డి మోహన్ రావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు రెండో ఆడ శిశువు గత నెల నాలుగో తేదీన నూజివీడు ఆసుపత్రిలో జన్మనిచ్చింది. పుట్టిన శిశువు ఆకారంలో మార్పులను గమనించిన వైద్యులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ఆ తల్లిదండ్రులు వెంటనే విజయవాడకు తీసుకుని వెళ్ళితే గుంటూరు సర్వ జన ఆసుపత్రి వెళ్ళమని చెప్పడంతో అదేరోజు జిజిహెచ్ లో చేర్పించారు. శరీరంలో ఆడ శిశువుకు మూడు కాళ్ళు ఉండటాన్ని న్యూరో సర్జరీ విభాగం వైద్యులు శేషాద్రి, హనుమ శ్రీనివాస రెడ్డి గుర్తించారు. నడుం భాగం నుంచి పెరిగిన మూడో కాలును గత నెల 31 వ తేదీన విజయవంతం గా శస్త్ర చికిత్స చేసి తొలగించారు. నడుం భాగంలో మిగిలిన రెండు కాళ్లకు సంబంధించిన నరాలు కాలుకు అతుక్కుని పోవడంతో వాటిని ఆధునిక చికిత్స ద్వారా వేరు చేసి ప్రాణం పోశారు . నడుం నుంచి వచ్చిన మూడో కాలుకు పురుష జన నంగాలు ఉండటం గమనార్హం. దీనిని వైద్య భాష లో లంబర్ మైలో మీనింగ్ సీల్ విత్ ట్రైపీడస్ డిఫార్మటిగాపిలుస్తారన్నారు.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యశాస్త్రంలో ఇటువంటి కేసులు 21 నమోదయ్యాయి. గుంటూరు సర్వ జన ఆసుపత్రిలో జరిగిన ఈ చికిత్స తో 22 వ కేసుగా నమోదవుతుందన్నారు.ఈ కేసును అంతర్జాతీయ వైద్య సదస్సులో ప్రచురిస్తామని డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. చికిత్సను విజయవంతం చేయడంలో ప్రతిభ కనబర్చిన న్యూరో సర్జరీ వైద్య బృందానికి ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరమ్మ అభినందనలు తెలిపారు.శిశువు తల్లి వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ తన బిడ్డకు గుంటూరు ప్రభుత్వ వైద్యులు ప్రాణం పోయడం ఆనందంగా ఉంది. పుట్టగానే ఆకారంలో మార్పులు ఉండటం గమనించి మొదట భయపడ్డాను. గుంటూరు ఆసుపత్రికి వచ్చిన తర్వాత వైద్యులు అందించిన కృషి మరువలేమని అన్నారు.