Tuesday, November 26, 2024

మానవత్వమా నీవెక్కడ? ఆసుప‌త్రి ముంగిట ప్రాణం విడిచిన నిండు గ‌ర్భిణీ

మృతదేహం తరలింపు కోసం 3 గంటలకు పైగా నిరీక్షణ
గుంటూరు జిల్లాలో హృదయవిదారక ఘటన

గుంటూరు – కరోనా మహమ్మారి మనుషులనే కాదు మానవత్వాన్ని కాటేస్తోంది. ప్రభుత్వమూ, అధికారులు, స్వచ్చందసంస్థలు కరోనాపై అవగాహన కల్పించేందుకు శాయశక్తులు కృషిచేస్తున్నా ప్రజలలో నెలకొన్న అపోహలు తొలగిపోవటం లేదు. ఈ విధంగా తలెత్తుతున్న అపోహలు మతపరమైన ఆచారాలు, విశ్వాసాలను మంట గలపటమే కాకుండా మానవత్వానికే మాయని మచ్చను తెస్తున్నాయి. ప్రజలలో నెలకొన్న అపోహల కారణంగా సంప్రదాయరీతిలో అంత్యక్రియలు నిర్వహించాల్సిన ఒక నిండు గర్భిణీని, అందుకు విరుద్ధంగా ఖననం చేయాల్సిన అనివార్య పరిస్తితి తలెత్తింది. నిండు గర్భిణీ గా వున్న తమ కుమార్తె కళ్లెదుటే విగత జీవిగా మారటంతో గుండెలవవిసేలా రోదించి సొమ్మసిల్లిన ఆ తల్లిదండ్రుల గోడు అరణ్యరోదనే అయింది. గుంటూరుజిల్లా అమర్తలూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన మౌలికంగా ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. అమర్తలూరులో నివాసముండే గుంటుపల్లి భారతి అనే నిండు గర్భిణీ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో ఏ చిన్న అనారోగ్యం సంభవించినా అనుమానించే పరిస్తితి. అటువంటి తరుణంలో ఆమెను సమీపంలో వుండే తెనాలి పట్టణానికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వారికి వాహనం దొరకలేదు. దీంతో వారు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ లో తీసుకెళ్లాలంటే కోవిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయాలని వారు నిబంధన విధించారు. అప్పటికే రాత్రి సమయం కావటంతో కోవిడ్ పరీక్ష చేయించేందుకు అవకాశం లేకుండా పోయింది. మరుసటిరోజు ఉదయమే అమర్తలూరు ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్దకు పరీక్ష నిమిత్తం తమ కుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు వెళ్లారు. అయితే ఆ కేంద్రం మెట్ల వద్దనే ఆమె కుప్పకూలి మరణించారు. కళ్ళముందే కన్నకూతురు కన్నుమూయటంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరకు మూడు గంటల నిరీక్షణ అనంతరం కొంతమంది బంధువుల సాయంతో వారు ఆ మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అయితే అక్కడా వారికి చుక్కెదురైంది. కోవిడ్ వచ్చిందనే కారణంగా అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు కొంతమంది అభ్యంతరం చెప్పారు. చివరకు అధికారుల జోక్యంతో కోవిడ్ నిబంధనల ప్రకారం ఆ మృతదేహాన్ని ఖననం చేశారు.

ఎవరు బాధ్యులు?
అమర్తలూరులో భారతి అనే గర్భిణీ మరణానికి ఎవరు బాధ్యత వహించాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఆమెకు సకాలంలో వైద్యం అందిన పక్షంలో ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం వుండేది. కేవలం సకాలంలో వైద్యం అందుబాటులో లేక ఆమె మరణించిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. కోవిడ్ పరీక్షల కోసం చేసిన నిరీక్షణ ఆమె ప్రాణం మీదకు తెచ్చిందన్న అనుమానం తలెత్తుతోంది. ఒక నిండు గర్భిణీ నడిరోడ్డుపై కుప్పకూలి చనిపోతే ఆమె ను అక్కడ నుంచి తరలించేందుకు 3 గంటలపాటు ఏఒక్కరూ ముందుకు రాకపోవటం సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తోంది. కనీసం ఆ కుటుంబ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం సైతం లేకుండా ఖననం చేయటం నిజంగా కరోనా పట్ల వేళ్లూనుకొని వున్న అపోహలు, ఛాందసవాదానికి పరాకాష్టగా పేరొనవచ్చు. ఈ విధమైన పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికార యంత్రాంగం పై ఎంతైనా వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement