Friday, November 22, 2024

నిమ్మ‌గ‌డ్డ‌ను ఉతికి ఆరేసిన మంత్రి పేర్ని నాని….

అమ‌రావ‌తి – పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు మేలు, మెప్పు కోసం పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఉద్యోగం ఊడిపోయే రోజు శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండి ప‌డ్డారు మంత్రి పేర్ని నాని. నిమ్మ‌గ‌డ్డ గ‌వ‌ర్న‌ర్ కు రాసిన లేఖ‌ పచ్చి తిరుగుబోతు.. బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, నిమ్మగడ్డ… నిస్పక్షపాతం గురించి మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. వివాదాలన్నింటికీ మూల విరాట్‌లా నిమ్మగడ్డ తయారయ్యాడన్నారు. నిమ్మగడ్డ వారి శ్రీరంగ నీతులతో కూడిన లేఖ హాస్యాస్పదంగా ఉందని నాని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎవరి మనిషో ప్రపంచం మొత్తం కళ్లతో చూసిందన్నారు. ఉద్యోగం ఊడిపోయే రోజున గవర్నర్‌కు రాసిన లేఖలో 25–30 రికమండేషన్స్‌ రాశార‌ని, నిమ్మగడ్డ రాసిన లేఖ ఒక తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పక్షపాత ధోరణి కళ్లకు కనిపించకుండా.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి పెద్ద సూత్రాలు రాశానని నిమ్మగడ్డ లేఖలో హెడ్డింగ్‌ పెట్టాడం విడ్డూరంగా ఉందన్నారు. 2016 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు రక్షణే రాష్ట్ర ఎన్నికల సంఘానికి విధులు, బాధ్యతగా పనిచేశార‌న్నారు. ఇంత అమోఘంగా ఎన్నికల కమిషన్‌ను నడిపిన నిమ్మగడ్డ నిర్లజ్జగా బరితెగించి ఉత్తరాలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పట్టపగలు పచ్చిగా బరితెగించి లాడ్జిలకు వెళ్లి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో గంటల కొద్ది రాజకీయ మంత్రాంగం, యంత్రాంగం నడిపిన నిమ్మగడ్డ.. ఎన్నికల కమిషన్‌ అంటే రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. వివాదాలన్నింటికీ మూల విరాట్‌గా నిమ్మగడ్డ రమేష్‌ తయారయ్యార‌న్నారు. కోవిడ్‌ కేసులు ఒక్కటి కూడా నమోదు కానప్పుడు ఎన్నికలు వాయిదా వేసి.. కేసులు వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిందేనని కోర్టు కెళ్లార‌ని గుర్తుచేశారు. టీడీపీకి నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆదేశం మేరకు ఎన్నికలు వాయిదా వేశార‌న్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణ, వాయిదా వేశార‌ని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పునకు చంద్రబాబు, ఆయన తరఫున వాదించే నిమ్మగడ్డ ఒక్కసారిగా బిగుసుకుపోయార‌న్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఒక లేఖ తయారు చేయించుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మెయిల్‌ చేసిన నిమ్మగడ్డ… నిష్ప‌క్షపాతం గురించి మాట్లాడటం.. చూస్తుంటే నవ్వొస్తుందని మంత్రి పేర్నినాని అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క‌ర్‌ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచిన నిమ్మగడ్డ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఒక రాజకీయ పార్టీ ఆఫీస్‌లో లేఖ తయారుచేయించి.. దాన్ని మెయిల్‌ ద్వారా పొంది ఫార్వర్డ్‌ చేసే తపాలా ఉద్యోగిలా వ్యవహరించార‌ని ధ్వజమెత్తారు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం అయితే, ప్రజల ఏకపక్ష తీర్పు చంద్రబాబుకు, నిమ్మగడ్డకు చెంపపెట్టు కాదా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement