తెనాలి రూరల్ : సమాజంలో వేళ్లూనుకుపోయిన అసమానతలు అంటరానితనంపై చివరి వరకు పోరాడిన విశ్వకవి గుర్రం జాషువా జిల్లాగా పేరును పల్నాడు ప్రాంతానికి ప్రకటించి దళితుల్లో ఆత్మగౌరవం నింపాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ డిమాండ్ చేశారు. శనివారం కొలకలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఏ ఒక్క పేరులో కూడా దళితులు లేరని, ఇది దళితులను తీవ్రంగా అవమానించడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాషువా జిల్లా నామకరణం కోసం పల్నాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వస్తున్నారని, ఈ వివక్షతను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జాషువా పేరున జిల్లాగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని, వివక్షతలు చూపించే ఏ ప్రభుత్వాలకైనా పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు. సుదీర్ఘకాలం ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ కనీసం అంబేద్కర్ ఫోటో ఏ ఒక్క కరెన్సీ నోటు మీద కూడా తీసుకురాలేకపోయిన దౌర్భాగ్య పరిస్థితి గమనించామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఫోటోలు కరెన్సీ నోట్ల మీద తీసుకురాలేకపోయిందని, కాల గర్భంలో కలిసిపోయే నాయకులు చేస్తున్న ఇలాంటి దుశ్చర్యల వల్ల గుర్తింపు లేకుండా కాలగర్భంలోనే కలిసిపోతారని ఆయన హెచ్చరించారు. అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలు జనాభా దామాషా ప్రకారం ఉపకులాలతో కలిపి వాటాలు పంచుకుంటామని, అణగారిన అన్ని కులాల అభివృద్దే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ ను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital