Tuesday, November 19, 2024

ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు…

అమరావతి, : కరోనా రెండో దశ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం దానిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, పరిశ్రమల శాఖల అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీచేశారు.ఈనేపథ్యంలో రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సి జన్‌ కొరత లేకుండా చేయడానికి అధికార యంత్రాంగం అవ సరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆస్పత్రుల్లో రోగులకు అందించే లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంవో) రాష్ట్రంలోని మూడు ఉత్పతి కేంద్రాల నుండి రాష్ట్ర అవసరాలకు సరిపడా సరఫరా చేసేలా చర్యలు తీసుకుం టోంది. రాష్ట్రీయ్ర ఇస్పాత్‌ నిగమ్‌ లిమి-టె-డ్‌-వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐ ఎన్‌ఎల్‌-వీఎస్‌పీ), విశాఖపట్నంలోని ఎల్లెన్‌ బెర్రీస్‌ మరియు శ్రీకాకుళంలోని లిక్వినాక్స్‌ సంస్థలు ఈ లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వాస్తవంగా తయారీ కేంద్రాలవద్ద ఇప్పటివరకు ఆక్సిజన్‌ కొరత అంతగా లేకపోయినప్పటికీ దానిని ట్యాంకర్లలోకి నింపేందుకు, రవాణా చేసేందుకు అత్యధికంగా సమయం పడు తోంది. ఈ కారణంగా ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్‌ చేరలేకపోతుందని అధికార యంత్రాంగం ప్రాథమికంగా ఒక నిర్థారణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఎంఓ సరఫరా కోసం 100 నుంచి 120 క్రయోజెనిక్‌ ట్యాంకర్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. కానీ, రాష్ట్రాన్రికి 64 వాహనాలను మాత్రమే కేటాయించడం జరిగిందని పేర్కొంటు న్నారు. కేంద్రం కేటాయించిన కేటాయింపుల ప్రకారం, ప్రతి రోజు రాష్ట్రానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ నుండి 100 టన్నులు, లిక్వినాక్స్‌ నుండి 60 టన్నులు మరియు ఎల్లెన్‌ బెర్రీస్‌ నుండి 40 టన్నుల మేర ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఇది కాకుండా, కర్ణాటకలోని బళ్లారిలో ఉత్పత్తిదారుల నుండి 68 టన్నులు, చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌ నుండి 10 టన్నులు కేటాయిం చారు. వీటితోపాటు ఏప్రిల్‌ 21న రాష్ట్రానికి అద నంగా ఒడిశాలోని అంగుల్‌ నుండి 150 టన్నులు కేటాయించారు.రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు మరియు చిత్తూరు జిల్లాలకు బళ్లారి నుండి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అందించబడుతుంది. వైజాగ్‌, శ్రీకాకుళం ప్రాంతం నుండి మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ఈ ఆక్సిజన్‌ సరఫరాకు సం బంధించి రవాణా అంశం కీలకంగా మారింది. కొన్ని జిల్లాలకు చేరుకోవడానికి 400 నుండి 500 కి.మీ. ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ సమయం చాలా కీలకంగా మారింది. దీనితోపాటు ట్యాంకర్‌ నింపడానికి సుమారు 6 గంటలు పడుతోంది. అలాగే ఒడిశాలోని అంగుల్‌ నుండి ఎల్‌ఎంవోను తీసుకురావడానికి కనీస సమయం నాలుగు రోజులు పడుతోంది. అలాగే, రోజుకు కేటాయించిన 150 టన్నులను సజావుగా రవాణా చేయడానికి, ఒక్కొక్కటి 20 టన్నుల సామర్థ్యం గల 30 నుండి 40 ట్యాంకర్లు అవసర పడనున్నాయి. అయితే, ఎక్కువ క్రయోజెనిక్‌ ట్యాంకర్లను ఏర్పాటు- చేయడం కష్టసాధ్యం కాబట్టి రవాణాచేసే సమయాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు- అధికారులు తెలిపారు.

విశాఖ ఆక్సిజన్‌ మనకివ్వరా?
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఆక్సిజన్‌ కొరత ఉంది. ఆక్సిజన్‌ అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌ను మహారాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రత్యేక రైలులో పంపారు. దేశానికి విశాఖ స్టీల్‌ ఆక్సిజన్‌ అందిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కూడా. కానీ అసలు విషయం ఇప్పుడు బయటకు పొక్కింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి ఒక్కటంటే ఒక్క ట్యాంకర్‌ ఆక్సిజన్‌ కూడా రాష్ట్ర అవసరాలకు అందలేదు. స్టీల్‌ ప్లాంట్‌ వంద శాతం కేంద్ర ప్రభుత్వానిదే. ఇంకా అమ్మకం కాలేదు కాబట్టి… కేంద్రం చేతుల్లోనే ఉంది. కేంద్రం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి ఎవరికి పంపించమంటే ప్లాంట్‌ అధికారులు వారికి పంపిస్తారు. ఏపీకి వ్యాక్సిన్‌ ఎంత కేటాయించారో కానీ.. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి మాత్రం ఇంత వరకూ ఒక్క ఆక్సిజన్‌ ట్యాంకర్‌ కూడా అందలేదని చెబుతున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి మెడికల్‌ అవసరాల కోసం రోజుకు వంద టన్నుల ఆక్సిజన్‌ను పొందడానికి అవకాశం ఉంది. పొందుతున్నారు కూడా. అయినప్పటికీ.. ఏపీకి కావాల్సినంత ఆక్సిజన్‌ లభించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement