జీతాల్లోంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సొమ్ము మినహాయింపు
భవిష్య నిధికి జమకాకుండా దారి మళ్లింపు
మద్యం షాపు ఉద్యోగులకు టోకరా
18 నెలలుగా ఇదే తంతు
అకౌంట్ నెంబర్ చెప్పరు.. ఖాతా తెరిచారో లేదో తెలీదు
రూ.40 కోట్లు గాయబ్ –సీఎం జగన్ లక్ష్యానికి తూట్లు
అమరావతి, : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ దిశగా వీలైనంత ఎక్కువ మందికి వివిధ మార్గాల ద్వారా ఉపాధి కల్పించి నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కూడా కల్పిస్తున్నారు. అయితే దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నిరుద్యోగుల శ్రమను నిలువునా దోచుకుం టున్నాయి. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా 2019 అక్టోబరులో రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 2900 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. వాటి పరిధిలో సూపర్వైజర్లు, సేల్స్‌మెన్, వాచ్‌మెన్‌ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగులకు ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. వారికి ప్రతినెల సూపర్వైజర్కు రూ. 17,500లు, సేల్స్‌మెన్‌కు రూ. 15 వేలు, వాచ్ మెన్‌కు రూ. 10,260లు వేతనంగా ఇస్తోంది. అయితే ఆ జీతాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ అయిన రెడ్డీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు ప్రతి నెల జమ చేస్తోంది. అయితే వారికి భవిష్యనిధి భద్రతను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగానే ఏజెన్సీ ద్వారా ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెల ప్రావిడెంట్ ఫండ్ (భవిష్యనిధి), ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టే ట్ ఇన్సూరెన్స్) రూపంలో కొంత నిధిని కోత విధిస్తూ వస్తుంది. అయితే 18 నెలలు అవుతున్నా ఇప్పటివరకు మద్యం దుకాణాల ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ ఖాతా కానీ, అందుకు సంబంధించి ఖాతా నెంబరు కానీ వారికి ఇవ్వలేదు. ఇదే విషయంపై ఏజెన్సీ యాజమాన్యాన్ని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తే పీ ఎఫ్ సొమ్ములు మీ ఖాతాకు జమ అవుతున్నాయిలే అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. అందుకు సంబంధించి ఎటువంటి రికార్డులను ఉద్యోగులకు అందజేయక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ పీఎఫ్ ఖాతాలు ప్రారంభించిందా..? అన్న సందేహాలు కూడా ఉద్యోగులు వ్యక్తమవుతున్నాయి.
కోత ఇలా.. కానీ ఖాతాలో పడలే…
రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో 10 వేల మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. సూపర్వైజర్కు నెలకు రూ. 17500లను ప్రభుత్వం గౌరవ వేతనం రూపంలో మంజూరు చేయగా.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రూ. 2150లను పీఎఫ్ క్రింద కట్ చేసి మిగిలిన సొమ్మును ఆ ఉద్యోగి వ్యక్తిగత ఖాతాకు ప్రతి నెల జమ చేస్తోంది. అదేవిధంగా సేల్స్‌మెన్‌కు సంబంధించి రూ. 15 వేలకు గాను రూ. 1700లు, వాచ్‌మెన్‌కు సంబంధించి రూ. 10,260ల జీతంలో నుంచి రూ. 1500లు పీఎఫ్ రూపంలో ప్రతి నెల కట్ చేస్తున్నారు. అయితే గడిచిన 18 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉద్యోగుల జీతాలకు సంబంధించిన సొమ్ము నుంచి పీఎఫ్ నిధి క్రింద రూ. 5 వేల వరకు కట్ చేస్తోంది. ఈ లెక్కన గడిచిన ఏడాదిన్నర కాలానికి సంబంధించి సుమారు రూ. 40 కోట్లకు పైగా వారి జీతాల్లో నుంచి ప్రతి నెల పీఎఫ్ క్రింద అమౌంట్‌ను కట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సొమ్ము ప్రస్తుతం ఏ ఖాతాలో జమ అయిందో కూడా తెలియదు. అందుకు సంబంధించి ఉద్యోగులకు ఖాతా నెంబర్లు కూడా నేటివరకు ఇవ్వలేదు. దీన్నిబట్టి చూస్తుంటే ఏజెన్సీ పీఎఫ్ సొమ్మును దారిమళ్లించినట్లు స్పష్ట ంగా అర్థమవుతోంది. లోటు బడ్జెట్లోనూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ఓవైపు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమలతో పాటు వివిధ మార్గాల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా తాత్కాలిక ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మద్యం ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ ఖాతాల వ్యవహారంపై విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.