Sunday, November 17, 2024

పంట కాలువల మరమ్మతులు… ఉసెత్తని పాలకులు

పొన్నూరు ఫిబ్రవరి 18 ప్రభ న్యూస్ – పంట కాలువలకు ఏళ్ల తరబడి మరమ్మత్తులు చేపట్టకపోవడంతో అన్నదాతలు కడగండ్ల పాలవుతున్నారు. అప్పుడప్పుడు తూతూ మంత్రంగా చేపట్టే మరమ్మతులు రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని వాపోతున్నారు. స్థానిక నిడుబ్రోల్లోని అలవల ఛానల్లో తూటి కాడ, గుర్రపు డేక్కతో నిండి ఉండటంతో పాటు ఛానల్ షట్టర్లు ధ్వంసమయ్యాయి. తద్వారా కాల్వ చివరి భూములకు సాగునీరు అందక రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాగునీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా లాక్కొని నాట్లు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

అలవల ఛానల్ మోదుగూరు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి రైతులు ప్రతి ఏటా సాగునీటిని దిగువకు రానీయకుండా అడ్డులు వేసి వరి నాట్లు వేసుకుంటున్నారు. వరి నాట్లు ఒకేసారి రావడంతో దిగువ రైతులు కాల్వ చివరి భూముల్లో ఆయిల్ ఇంజన్లతో వరి నాట్లు వేసుకుంటున్నారు. ఈ ఛానల్ పరిధిలో సుమారు 3,500 ఎకరాయకట్టు ఉంది. 2,500 మంది సన్న చిన్న కారు రైతులు సాగు చేస్తున్నారు. అలవల చానల్ కు రీడింగ్ 50 నుండి 60కి మించి లేకపోవడంతో దిగువభాగం రైతులు వ్యవసాయం చేయడంలో అనేక సమస్యలతో సతమతమవ్వటంతో పాటు అధిక పెట్టుబడులు పెడుతున్నారు.కాల్వ చివరి భూముల రైతులు ఏళ్ల తరబడి నాట్లు పడక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పాలకులు , ఇరిగేషన్ శాఖ అధికారులు ఛానల్ షట్టర్లు మరమ్మతులు చేపట్టడంలోనూ, తూటి కాడ గుర్రపుడెక్కను తొలగించడంలో చొరవ తీసుకోవాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement