Tuesday, November 26, 2024

ఆల‌యాలు వెల వెల – జీతాల‌కు క‌ట‌క‌ట‌..

అమరావతి, : రాష్ట్రంలోని ఆలయాలు కరోనా కోరల్లో విలవిల్లాడుతున్నాయి. కరోనా రెండో దశ ఉధృతి నేపధ్యంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతుంటే..భక్తులు సైతం ఆలయాలకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. రోజు రోజుకూ పరిస్థితి విషమిస్తున్న నేపధ్యంలో దేవదాయశాఖ సైతం భక్తుల దర్శనపు వేళలను కుదించి దర్శనాలకు అనుమతిస్తున్నప్పటికీ..భక్తుల రాక అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆలయాల ఆదాయం భారీగా పడిపోతున్నట్లు అధికారులు చెపుతున్నారు.
రాష్ట్రంలో కరోనా రెండో దశ ఉధృతంగా వ్యాపిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా..పదుల సంఖ్యలో మృత్యువాతపడు తున్నారు. ప్రభుత్వం సైతం కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలను ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం పరిమితంగా తిప్పుతున్నారు. ఈ క్రమంలో ఆలయాల్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేవదాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పలు ఆలయాల్లో దర్శన వేళలను కుదించడంతో పాటు కరోనా తీవ్రంగా ఉన్న జిల్లాల్లో ఆలయాల దర్శనాలకు అనుమతించడం లేదు. అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను ఇప్పటికే నిలిపేసినట్లు అధికారులు చెపుతున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం నుంచి భక్తుల దర్శనాలను మరింతగా కుదించి రెండు గంటలకు మాత్రమే పరిమితం చేశారు. ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు మాత్రమే భక్తులను అను మతించనున్నట్లు పేర్కొన్న ఆలయ అధికారులు.. శ్రీకాళహస్తిలో ప్రసిద్ధి చెందిన రాహుకేతు పూజలు సహా అన్ని సేవలను భక్తుల పరోక్షంలోనే చేయనున్నట్లు తెలిపారు.
శ్రీశైలం, దుర్గగుడి, ద్వారకా తిరుమల, సింహాద్రి అప్పన్న సహా పలు ఆలయాల్లో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 11గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నారు. మరికొన్ని చిన్నపాటి ఆలయా లను ఉదయం 8గంటల తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతిం చడం లేదు. ఆలయాల్లో నిర్వహించే అన్ని సేవలను భక్తుల పరోక్షం లోనే జరుపుతున్నారు. గత ఏడాది పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆలయాలపై కరోనా రెండోదశ తీవ్ర ప్రభావం చూపినట్లు చెప్పొచ్చు.రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల రాకపోకలు భారీగా తగ్గాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి ఆలయానికే రోజుకు 15వేల మందికి మించి భక్తులు రావడం లేదంటే..మిగిలిన ఆలయాల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు కరోనా భయం ఉంటే..మరో వైపు ప్రజా రవాణా లేకపోవడం కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమని అధికారులు చెపుతున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు అవుతున్న నేపధ్యంలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే బస్సులు, ఇతర వాహనాలను అనుమతిస్తున్నారు. పొరుగు జిల్లాల భక్తులు ఆయా ఆలయాలకు వెళ్లాలంటే తగిన రవాణా సౌకర్యం లేని పరిస్థితి. ఇదే సమయంలో సొంత వాహనాలపై వెళ్లినప్పటికీ 12గంటల లోపు తిరిగి రాని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆలయాల దర్శనాలకు వెళ్లేందుకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేవలం ఆయా జిల్లాల్లోని భక్తులు మాత్రమే పెద్ద సంఖ్యలో ఆలయాల సందర్శనకు వెళుతున్నారు.
జీతాల చెల్లింపు ఎలా?
రాష్ట్రంలోని ఆలయాల ఆర్థిక పరిస్థితి భారీగా పడిపోనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి రోజు వారీ ఆదాయం రూ.50లక్షలకు మించడం లేదు. అక్కడి పరిస్థితి ఆ విధంగా ఉంటే రాష్ట్రంలోని ఇతర ఆలయాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కర్ఫ్యూ కాలంలో భక్తుల ద్వారా ఆదాయం ఎంతొచ్చిందనేది కొద్ది రోజుల్లో హుండీలు లెక్కిస్తే తేలనుంది. గతేడాది ఆలయాలకు భక్తుల దర్శనాలను 80 రోజుల వరకు ఆపేశారు. మార్చి 22 నుంచి జూన్‌ 11 వరకు భక్తుల దర్శనాలను ఆపేసిన అధికారులు..జూన్‌ 12 నుంచి అనుమతించారు. అదికూడా పలు ఆంక్షల నడుమ భక్తుల దర్శనాలకు అనుమతించడంతో అక్టోబర్‌ నాటికి పరిస్థితి కొంత చక్కబడింది. ఆ తర్వాత క్రమేపీ ఆలయాలు భక్తుల రాకపోకలతో సందడి సంతరించుకుంటున్న తరుణంలో కరోనా రెండోదశ ఆలయాలపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల, జీత భత్యాలపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement