Tuesday, November 19, 2024

కాఫీతో కాసులు – మిరియాల‌తో సిరులు….

అమరావతి /విశాఖపట్నం : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పండుతున్న పంటలు సిరులు కురిపిస్తున్నాయి. మన మన్యం ఉత్పత్తులకు పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా అరకు కాఫీ, మిరియాల పంటలకు కాసులుపంట పండుతోంది. ఎరువులు, రసాయనాలు వినియోగించకుండా పండించే పంటలను పట్టణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు ఇప్పటికి కొన్ని గిరిజన ప్రాంతాల్లో వారంతపు సంతల్లో అటవీ ఉత్పత్తుల విక్ర యాలు సాగుతుంటాయి. అయితే గిరిజనుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించి వారికి ఎక్కువ లాభాలు సమకూర్చేందుకు ప్రభుత్వం గిరిజన కార్పోరేషన్‌ ద్వారా వారికి అనేక సౌకర్యాలను సమకూరుస్తోంది. ఏజన్సీ ప్రాంతమైన అరకులో పండించే కాఫీకి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఏజన్సీ ప్రాంతాల్లోని లక్షా 58 వేల ఎకరాల్లో కాఫీ పంటను పండిస్తున్నారు. 11వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల ఉత్పత్తి జరుగుతోంది. ఏజన్సీ ప్రాంతాల్లో పండే పసుపు, కొన్ని కూరగాయలకు కూడా డిమాండ్‌ ఉంది. ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాల్లో పసుపు పంటను రైతులు పండిస్తున్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో పండే పసుపునకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. వీటిని దేశం లోని పలు ప్రాంతాలకు గిరిజన కార్పోరేషన్‌ ఎగుమతి చేస్తోంది కూడా. ఇక ఏజన్సీ ప్రాంతాల్లో పండే మిరియాలకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో ఇటీవల కాలంలో విదేశాలకు మిరియాల ఎగుమతులు ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్ర ఏజన్సీ ప్రాంతాల్లోని 98 వేల ఎకరాల్లో మిరియాల పంటను రైతులు పండిస్తున్నారు. సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల టన్నుల మిరియాల ఉత్పత్తి జరుగుతోంది. ఉత్తరాంధ్ర ఏజన్సీ ప్రాంతాల్లోని 96 వేల ఎకరాల్లో పండే మిరియాలను విదేశాలకు ఇటీవల కాలంలో ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. చింతపల్లి, పాడేరు, అనంతగిరి ఏజన్సీ ఏరియాల్లో కాఫీ పంటతో పాటు మిరియాల పంటలను కూడా అంతర పంటగా వేస్తున్నారు. డెన్మార్క్‌ నుంచి 23 మెట్రిక్‌ టన్నుల మిరియాలకు ఆర్డర్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి గమనిస్తే ఏజన్సీ ప్రాంతాల్లో పండిస్తున్న మిరియాలకు ఉన్న డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement