Saturday, November 23, 2024

కోవిడ్ మహమ్మారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప‌టిష్ట‌ చర్యలు – ఎమ్మెల్యే శివకుమార్

కొల్లిపర, : ప్రజలను కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది అని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రం కొల్లిపరలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా శివ కుమార్ మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉందన్నారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబర్చి నట్లు చెప్పారు. కొల్లిపర మండలం లో 121 పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడం బాధాకరమన్నారు. ఈ ప్రాంత ప్రజలను కాపాడుకునేందుకు అధికారులతో కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే మండలంలో అధికారుల సహకారంతో కోవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి అని వివరించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తెనాలిలో కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్లను ప్రారంభించామని దీని ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ హెల్ప్ డెస్క్ కు వివిధ శాఖల అధికారులను అనుసంధానం చేశామన్నారు. అలాగే మండల కేంద్రం కొల్లిపర లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఎవరైనా కోవిడ్ వైరస్ సోకి బాధపడుతుంటే హెల్ప్ డెస్క్ నెంబర్ 8374989885 ఈ నంబరుకు ఫోన్ చేస్తే సత్వరమే వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ హెల్ప్ డెస్క్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. వైరస్ వచ్చిన రోగికి ఇబ్బందులు తీవ్ర స్థాయిలో ఉంటే ఇక్కడి సిబ్బంది మెరుగైన వైద్యం కోసం తెనాలి వైద్యశాలకు తరలించినట్లు శివకుమార్ వివరించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంను కోవిడ్ సెంటర్గా మార్చి దీని లోని 50 బెడ్లు వైరస్ బాధితులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. తెనాలిలోని కోవిడ్ సెంటర్ను 400 బెడ్లు తో ప్రారంభించి 875 బెడ్లు చేశామని దీన్ని 1100 బెడ్లు గా మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని చెబుతూ వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు వైరస్ బారిన పడి బాధపడటం మనసును కలిసి వేస్తుందన్నారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ నేను మీకు ఒక అన్నగా చెబుతున్నా దయచేసి అనవసరంగా బయట తిరిగి కరోనా బారిన పడవద్దని, మీ కారణంగా ఇంటిలోని పెద్దలు ప్రమాదంలో పడతారని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ను కట్టడి చేయడం సాధ్యమవుతుంది అన్నారు. హెల్ప్ డెస్క్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీవో పి శ్రీనివాసులు, డాక్టర్లు నాగరాజు, లక్ష్మీ సుధా వివిధ శాఖల అధికారులు, వైయస్ఆర్ సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎం.వి శివరామకృష్ణరెడ్డి నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, ఆరిక చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, ఉప సర్పంచ్ అవుతూ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement