గుంటూరు, ప్రభన్యూస్ బ్యూరో : మిర్చి రైతులు ఆశ..నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతు న్నారు. ఒక దశలో ఆశించిన రేటు పలికిన మిర్చి, తాజాగా క్వింటాకు రెండు నుంచి మూడువేల రూపాయలు పడిపోవడంతో నష్టాలు చవిచూస్తున్నారు. ఆసియా ఖండం లోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు సీజన్ కావడంతో నిత్యం లక్ష టిక్కీలు దిగుమతి అవుతున్నాయి. ఇక్కడి మిర్చికి దేశీయ, విదేశీయంగా మంచి డిమాండ్ ఉండ డంతో రేట్లు కూడా అదేస్థాయిలో వస్తాయని భావించారు. అయితే ఎగుమతి వ్యాపారు లంతా సిండికేట్‌గా మారి ధరలను అమాంతంగా తగ్గించారు. సీజన్‌లో రైతుల వద్ద ఉన్న సరుకంతా వ్యాపారులు కొనుగోలు చేసి శీతల గిడ్డంగుల్లో నిల్వచేస్తారు. రైతుల చేతుల్లో నుంచి సరుకు పూర్తిగా వ్యాపారుల హస్తగతమైన తర్వాత రేట్లను పెంచడం పరిపాటిగా మారింది. యార్డులో ప్రస్తుతం అదే మాయ చేసి రైతులకు మొండి చేయిచూపిస్తున్నారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, బళ్లారి జిల్లాల నుంచి ఎక్కువగా మిర్చి గుంటూరు యార్డుకు వస్తుంది. యార్డులో క్రయ విక్రయాలు చురుగ్గా సాగుతున్నాయి. గత వారం కన్నా ఈ వారం కొన్ని వెరయిటీ- ధరలు తగ్గగా, మరికొన్ని వెరైటీ-ల ధరలు నిలకడగా ఉన్నాయి. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి మొదటి విడత కోతల ద్వారా వచ్చిన మిర్చి ఇప్పటికే రెండు వారాల నుంచి యార్డుకు వస్తోంది. రాయలసీమ జిల్లాల నుంచి రెండో విడత కోతల ద్వారా వచ్చిన మిర్చి వస్తోంది. తాజాగా వివిధ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నా వ్యాపారులు ధరలు పెంచడం లేదు. దేశీయంగానూ ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు ఆశాజనకంగా ఉన్నాయి. గుజరాత్, మహరాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్ర నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో గుంటూరు యార్డుకు వస్తున్నారు. కానీ కొన్ని వెరైటీ-లకే ధరలు వస్తున్నాయి. దేశీయ మార్కెట్‌కు డిమాండ్ ఉందని వ్యాపారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్రకు ఎగుమతి ఆర్డర్లు వస్తున్నాయని, విదేశీ ఆర్డర్లు వస్తే ధరలు పెరుగతాయని వ్యాపారులు చెబుతున్నారు. త్వరలో చైనా, బంగ్లాదేశ్, వియాత్నం, సింగపూర్ అర్డర్లు వస్తాయని తెలుస్తోంది.
ధరలు తగ్గుముఖం
మిర్చి యార్డులో ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. వర్షాలకు తడసి నాణ్యత తక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తిగా గ్రేడింగ్‌తో తీసువచ్చినా గతేడాది అన్ సీజన్‌లో వచ్చిన ధరలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. గత వారం కంటే ఈ వారం కొన్ని రకాలకు క్వింటాల్‌కు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు తగ్గాయి. స్పెషల్ వెరైటీ-ల ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. నాన్ ఎసి స్పెషల్ వెరయిటీ-లు క్వింటాల్ కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.25 వేలుంది. మేలు రకాలైన తేజ క్వింటాల్ కనిష్టం రూ.7,500, గరిష్టం రూ.20 వేలు, బాడిగ రకం కనిష్టం క్వింటాళ్ రూ.8 వేలు, గరిష్టం క్వింటాల్ రూ.25 వేలు, దేవనూరు డీలక్సు కనిష్టం రూ.11 వేలు, గరిష్టం రూ.21,500 వేలు లభించాయి. గత నెలలో కనిష్ట ధర రూ.10 వేల వరకు పలకగా, ప్రస్తుతం రూ.రెండు వేల వరకు వరకు తగ్గింది. నాన్ ఎసి సాధారణ రకాలు క్వింటాల్ కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.21,500 పలికింది. వీటి ధరలు కూడా రూ.వెయ్యినుంచి రూ.2 వేల వరకు తగ్గాయి. కొన్నిరకాలు నిలకడగా ఉన్నాయి. 334 రకం కనిష్ట ధర క్వింటాల్ రూ.8,500, గరిష్ట ధర రూ.20,500 నెంబరు 5 రకం కనిష్ట ధర రూ.10 వేలు, గరిష్టం రూ.20 వేలు, 273 రకం కనిష్టం రూ.11 వేలు, గరిష్టం రూ.18,500 వేలు, 341 రకం కనిష్టం రూ.9 వేలు, గరిష్టం రూ.21,500, 4884 రకం కనిష్టం రూ.14 వేలు, గరిష్టం రూ.17,500 ధరలు లభించాయని యార్డు అధికారులు చెప్పారు. గతేడాది ఇదే సీజన్‌లో సగటు- ధర రూ.15 వేల నుంచిరూ.16 వేలు ఉండగా ఈ ఏడాది రూ.17 వేల నుంచి రూ.18 వేల మధ్యన వస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సీజన్ మొదలైనప్పటి నుంచి సగటు-న గరిష్టంగా రూ.18 వేలకు మించి ధర వస్తోంది.