Sunday, November 17, 2024

రాతి శిలలతో మహంకాళి ఆలయ పునఃనిర్మాణం

దుగ్గిరాల ఫిబ్రవరి 19(ప్రభ న్యూస్) భక్తురాలి కలలో కనిపించి పుట్టలో స్వయంభుగా వెలసి, నాటినుండి నేటి వరకు భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి పునాది పడనుంది. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా వెలుగొందుతున్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం పునః నిర్మాణానికి సన్నద్ధమవుతుంది. దేవాదాయ శాఖ, భక్తులు, దాతల సహకారంతో ఆలయ పునః నిర్మాణానికి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకెళ్తే మండల పరిధిలోని కంఠమరాజు కొండూరు గ్రామంలో వెలసిన శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. మంచికలపూడి గ్రామానికి చెందిన దేవా భక్త ని సుబ్బారావు కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నట్లుగా తవ్వించి తనకు దేవాలయం కట్టాలని శ్రీ మహంకాళి అమ్మవారు తెలపటం తర్వాత పుట్టని తవ్వించి అమ్మవారిని, ఇతర విగ్రహ ప్రతిమలు దేవతామూర్తుల విగ్రహాలను బయటకు తీసి 1977 వ సంవత్సరంలో పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 46 సంవత్సరాలుగా భక్తుల కోరికలను తీర్చే తల్లిగా వెలుగొందుతూ దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ అధికారులు, దాతలు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆలయ నిర్మాణానికి సుమారు 10 కోట్ల వ్యయంతో పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వము దేవదాయ శాఖ అధికారులతో మాట్లాడి 99 లక్షలు నిధులను మంజూరు చేయించారు. దీంతో మరిన్ని నిధుల సమీకరణకు దాతలు ముందుకు రావడంతో అధికారులు పునః నిర్మాణం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం రాతిశిలలు తీసుకొనివచ్చి వివిధ ఆకృతిలో సిద్ధం చేస్తున్నారు. అంతరాలయం నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో భక్తుల కోసం బాలాలయం సిద్ధం చేస్తున్నారు.


సరికొత్త రీతిలో రాతితో నూతనాలయం
పురాతన దేవాలయాల రూపు వచ్చేలా నూతన రీతిలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణము ఉండనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం రాతిశీలలతో ప్రత్యేకంగా ఆలయ ఆకృతులను తయారు చేస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో లభించే రాతి శిలలను ఆలయానికి తీసుకుని వచ్చి ఇక్కడే వాటిని శిల్పకళ ప్రతిబింభించేలా ప్రత్యేక ఆకృతులలో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పూర్తిగా తొలగించి గర్భాలయాన్ని కదిలించకుండా నూతన ఆలయ శిఖరాలను ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. దేవాలయ నిర్మాణంకి వినియోగించే రాతి శిలల పై దేవతామూర్తుల విగ్రహాలను పుష్పాలను వివిధ ఆకృతులను శిల్పులు తయారు చేస్తున్నారు. ప్రధానంగా అమ్మవారి అంతరాలయము, ముఖమండపము, అలివేటి మండపము, రాజగోపురము, గాలిగోపురం నిర్మాణము చేపట్టనున్నారు. అదేవిధంగా భక్తుల సహకారంతో దాతల చేయూతతో ప్రదక్షిణ మండపము, వాహనములు తిరిగేందుకు సీసీ రోడ్లు ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. ఆలయ పునఃనిర్మాణం అనంతరము భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆల ఈవో చెప్పారు.


భక్తుల వితరణతో ఆలయ అభివృద్ధి
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి కోరిన కోరికలు నెరవేరడంతో ఆలయ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆలయం దినదినాభివృద్ధి సాధిస్తుంది. ప్రస్తుతము నిర్వహించనున్న ఆలయ పునర్ నిర్మాణ కార్యక్రమంలోనూ దాతలు ముందుకు వస్తున్నారు. ఆలయానికి రాతి శిలలు ఏర్పాటుకు ప్రధాన దాత ముందుకు రాగా మరింత అభివృద్ధికి పలువురు దాతలను అధికారులు కలిశారు. ఆలయ నిర్మాణం కోసం సుమారు 10 కోట్లు అంచనాలను అధికారులు వేశారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో దాతల సాయంతో స్థానిక అధికారులు ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. అంటరాలయము 2.25కోట్లు, అలివేటి మండపం 1.60కోట్లు, అంతరాలయం ముందు మండపము కోటి, గాలిగోపురంలో 1.40 కోట్లు,ఇతర అభివృద్ధి పనులు వెరసి మొత్తం 10 కోట్లు అంచనాలను అధికారులు వేశారు. ఇప్పటికే దేవాలయ శాఖ 99లక్షలు నిధులు మంజూరు కాగా పలువురు దాతలు ముందుకు రావడంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

మార్చి 6నుండి బాలాలయ దర్శనం
శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా అమ్మవారు షుమారు మూడు నెలల పాటు బాలాలయంలోనే భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే బాలాలయము నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణము పూర్తయ్యే వరకు గర్భలయములోని అమ్మవారికి అర్చకులే నిత్యపూజలు నిర్వహిస్తారు.నూతన ఆలయం పూర్తయ్యే వరకు అమ్మవారికి నిత్యపూజలు యధావిధిగా అంతరాలయంలో కొనసాగానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement