Friday, November 22, 2024

మండుతున్న ఎండలు.. ఎండుతున్న మల్లెలు

బాపట్ల – సుగంధ పరిమళాలను వెదజల్లే మల్లె పూల తోటలకు గుంటూరు జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందింది. తాజాగా మండే ఎండలు మల్లె రైతుల్ని కలవరపెడుతున్నాయి. ఇదే సందర్భంలో తోటలకు ఆశిస్తున్న తెగుళ్ళు మల్లె రైతుల్ని మరింత కుంగదీస్తున్నాయి. దీనికితోడు కరోనా వైరస్ నేపథ్యంలో పూల విక్రయాలు పూర్తిగా పతనమయ్యాయి. మహిళల మనసుల్ని దోచే మల్లె పూల సాగు గుంటూరు జిల్లాలో విస్తారంగా విరాజిల్లుతుంది. ఈ తోటలపై ఆధారపడి కొన్ని వేల మంది జీవనోపాధి కొనసాగిస్తున్నారు. బాపట్ల ప్రాంతాల్లోని అనేక సముద్ర తీర గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల్లో అనాదిగా మల్లె పూల తోటలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని అత్యధికంగా పెదవడ్లపూడి ,నూతక్కి గ్రామాల్లో మల్లె పూల తోటలను సాగు చేస్తున్నారు. మల్లెపూల సోయగాలతో జిల్లాలోని చాలా ప్రాంతాలు ఈ తోటలకు అత్యంత ప్రసిద్ధి గాంచాయి. తాజాగా మండే ఎండలు మల్లె తోటల్ని దడ పుట్టిస్తున్నాయి. తోటలకు ఆకుముడత తెగులు రావటంతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల ప్రాంతంలోని మల్లెపూలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. చూడముచ్చటైన సింగారం,చక్కటి సువాసన, పరిమళాలు వెదజల్లే ఈ ప్రాంతం మల్లెపూలకు మంచి ఆదరణ డిమాండ్ ఉంది. బాపట్ల ప్రాంతంలో సాగయ్యే మల్లెపూలను వెదుళ్ళపల్లి లోని పూల మార్కెట్ ద్వారా విక్రయాలు జరుపుతుంటారు. ఇక్కడి మల్లెపూలను కొనుగోలు చేసేందుకు నిత్యం అనేక జిల్లాల నుంచి కొనుగోలుదారులు ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. వెదుళ్ళపల్లి పూల మార్కెట్ లో నిత్యం లక్షలాది రూపాయల మల్లెపూల వ్యాపారం జరుగుతుంది. సీజన్లో అయితే ఇక్కడ మల్లెపూలకు మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో మల్లెపూల వ్యాపారం పూర్తిగా పతనమైంది. మండుతున్న ఎండలతో అసలే అంతంత మాత్రంగా దిగుబడి ఉంది దీనికితోడు కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈసారి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది కిలో మల్లెపూలు తాజాగా 60 నుంచి 80 రూపాయల ధర పలుకుతుంటే ,సీజన్లో అయితే 500నుండి 600 రూపాయల వరకు కూడా ఇక్కడ ధర పలుకుతాయి. ఈ ఏడాది మాత్రం ఎన్నడూ లేనంతగా మల్లెపూల దిగుబడి బాగా తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఎండల ప్రభావం, తోటలకు ఆశించిన తెగుళ్ళు ప్రధాన కారణంగా చెబుతున్నారు. తోటలకు ఆశించే తెగుళ్ళ నివారణ చర్యలు తెలియజేసేందుకు ఈ ప్రాంతంలో ఉద్యానవన శాఖ లేకపోవటం అనేక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున మల్లె పూల తోటలు సాగు చేస్తున్న ఈ ప్రాంతంలో ఉద్యానశాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement