లాక్ డౌన్ కారణంగా పనులు లేక విలవిలలాడుతున్న కార్మికులు
నిర్మాణ,వ్యాపార రంగంపై లాక్ డౌన్ ప్రభావం
బాపట్ల టౌన్- కరోనా ప్రభావం అన్ని రంగాల కార్మికులపై పడింది.పని చేస్తే కానీ పూటగడవని వేల కుటుంబాలు కరోనా కారణంతో అర్ధాకలితో అలమటిస్తున్నాయి.ఇప్పటికే చాలా కార్మిక రంగాలు కరోనా వైరస్ ప్రభావం తో మూతపడ్డాయి.దీనితో ఎందరో కార్మికులు పనులు లేక నానా అవస్థలు పడుతున్నారు. రెండవ దశలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రతి ఒక్కరిలో దడ పుట్టిస్తోంది.చిన్నపాటి అనారోగ్యం పాలైనా వైద్యశాలకు వెళ్లిన సరైన వైద్యం అందే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ధనవంతులు ఉన్నా వైద్యం అందే పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కార్మికుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల మారింది. ప్రస్తుతం ఉన్న తరుణంలో కార్మికులను ఏ ఒక్కరు కూడా దరిచేర్చుకొని ఆదుకునే పరిస్థితి లేదు.అధికంగా తాపీ పని,కరెంట్,సెంట్రింగ్, పెయింటింగ్,వివిధ రంగాల కార్మికులపై అధిక ప్రభావం చూపుతుంది.గృహాలను నిర్మించుకునే యజమానులు కూడా ప్రస్తుతం కార్మికులను పనులకు రావద్దని కరాఖండిగా చెబుతున్నారు. వేరే పని ఏదైనా చేసుకుందామని బయటికి వచ్చిన కరోనా భయంతో ఆగిపోతున్నారు.దీని తోటి పూట గడవక ఎందరో కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.అధికంగా కరోనా కేసులు నమోదవు తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు బయటకు రావాలని ఆ పై ప్రజలు ఎవరూ కూడా రోడ్లపైకి జరగకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించి కరోన నియంత్రణకు కృషి చేయాలని కోరింది.చిరువ్యాపారులు తోపుడు బండి పై చేసే వ్యాపారాలకు కూడా బాగా నష్టం కలుగుతుంది.వేల రూపాయలయో అనేక రకాల పండ్లు ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు.లాక్ డౌన్ కారణంతో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అనేక రకాల పండ్లు విక్రయాలు చేయడంతో సరైన బేరాలు లేక వారు కూడా పూర్తిస్థాయిలో నష్టపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మిక శాఖ ఆధ్వర్యంలో అనేక రకాల కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు గుర్తించి ఆర్థిక సహాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం తాపీ కార్మికుడు
కరోన కారణంగా పనులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తాపీ కార్మికుడు గోపి అన్నారు.రోజు పని చేస్తే ఆరు వందల వచ్చేవని,వాటిని సరుకులు బియ్యం కొనుగోలు చేసి కుటంబ సభ్యులు మూడు పుటలు తినేవారమిన్నారు.కరోన కారణంతో పనులు లేక పూట గడవం కూడా కష్టంగా మారిందని,కార్మిక శాఖ ద్వారా తమను ఆదుకోవాలని కోరారు.
వ్యాపారాలు లేక నష్టపోతున్నాం
లాక్ డౌన్ తక్కువ సమయంతో వ్యాపారాలు జరగక పండ్లు కుళ్ళిపోయి నష్టపోతున్నామని చిరు వ్యాపారి రమాదేవి అన్నారు.కరోన ప్రభావంతో ప్రజలు పండ్లు కొనుగోలు చేసేందుకు ఎవరు కూడా రావడం లేదన్నారు.సాధారణంగా సాయంత్రం సమయంలో బేరం ఉంటుందని,లాక్ డౌన్ కారణంగా సాయంత్రం సమయంలో వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశ లేక పోవడంతో వ్యాపారాలు జరగక నష్టపోవడంతో పాటు,అప్పులు పలు అవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.