Friday, November 22, 2024

కొండ‌వీడుకి రాచ‌ఠీవి…

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా చారిత్రక ప్రదేశాలున్నాయి. ప్రతి ప్రాంతానికి చాలా చరిత్ర, ప్రాముఖ్యత ఉన్నాయి. అవన్నీ ఆనాటి పాలనా వైభవాన్ని, రాచరికాన్ని మన కళ్లకు కట్టినట్లు- చూపిస్తాయి. ఇక అప్పటి శిల్పకళా చాతుర్యం, దైవ విగ్రహాలు అబ్బురపరు స్తుంటాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలో చారిత్రక ప్రదేశమైన కొండవీడు కోట ఇప్పుడు మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అద్భుతమైన ఘాట్‌ రోడ్డు నిర్మాణం, ఎటు- చూసిన పచ్చని చెట్లు-, ఆహ్లాదకరమైన వాతావరణం, ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజాయ్‌ చేయదగ్గ అద్భుతమైన చారిత్రక కట్టడం. హిమాలయాలు, తిరుమల, ఊటీ లాంటి ఘాట్‌రోడ్లుతో ప్రయాణించే అనుభూతి కొండవీడు ఘాట్‌రోడ్డులో కలుగుతోంది. దాదాపు వంద కోట్ల రూపా యల వ్యయంతో ఈ కొండను, కోటకు కొత్త కళ వచ్చేలా పనులు చేపట్టారు. ఈ కొండవీడు కోట గుంటూరుకు 12 మైళ్ల దూరంలో ఉంది.14 వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఈ కోటను నిర్మించారు. మొత్తం ఈ కోటలో 21 నిర్మాణాలు ఉన్నాయి. చాలా శాతం శిధిలమైనాయి. కొండవీడు పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది రెడ్డి రాజుల వైభవం. కొండవీడు ఖిల్లాను రాజధానిగా రెడ్డిరాజులు క్రీస్తు పూర్వం 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రఖ్యాతి గాంచింది. కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.


అద్భుత నిర్మాణ శైలి
కోట నిర్మాణశైలి అద్భుతంగా ఉంటు-ంది. గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరం నుంచి మరో కొండ శిఖరాన్ని తాకుతూ, కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను, మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ఈ ప్రాకారం ఉంటు-ంది. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలనుఅద్బుతంగా తీర్చిదిద్దారు. కొండలపైనే రాజు, రాణిల కోటలు, కారాగారం, వజ్రాగారం, ధాన్యా గారం, అశ్వ, గజ శాలలు, మందిరాలను ఏర్పాటు- చేశారు. అప్పట్లో కొండలపై రాజ ప్రాసాదాలలో నివసించే వారికి, సైనికులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులు తవ్వించారు. కోటలో మరింత ప్రత్యేకమైనవి ఇక్కడి బావులు. ఇంత ఎత్తైన కొండపై ఇంతింత లోతు బావుల్ని ఎలా తవ్వించారన్నది ఊహకందదు. వీటి నుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాళ్లు వాడేవారు. అందుకే కొండవీటి చాంతాళ్ళు అనే నానుడి వచ్చింది అని చెబుతారు.
కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన గోపీనాథస్వామి దేవాలయాన్నే కత్తుల బావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. వెన్న ముద్దల బాలకృష్ణుని విగ్రహం తొలిగా ప్రతిష్టించింది గోపీనాథస్వామి ఆలయం లోనే. కొండవీడు ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్బుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టు-కుంటాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొండవీడు కొండలపై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొండవీడు పరిసరాల్లో ఇప్పటికీ మరుగున పడిపోయి ఉన్న అనేక ఆనవాళ్ళు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలా బయటపడిన వాటిలో ఒకటి అతిపెద్ద దిగుడు బావి. 100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు కలిగి ఉన్న ఈ భావిని 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు త్రాగునీటి అవసరాల కోసం వినియోగించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
నగరవనంతో కొత్త కళ
రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం ‘నగరవనం’ కార్యక్రమంలో భాగంగా కోట పర్యాటకాభివృద్ధి వేగంగా జరుగుతోంది. పర్యాటక, అటవీ, ఆర్‌ అండ్‌ బి, పురావస్తు, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, దేవాదయశాఖల ఆధ్వర్యంలో రూ100 కోట్లతో కొండవీడులో అభివృద్ధి పనులు చేపట్టారు. నిధులు మంజూరుకావల్సి ఉంది. కొండ కింద నుంచి పైవరకు 51 కి.మీ ఘాట్‌రోడ్డు గతంలోనే పూర్తికాగా, కొత్తగా కొండపై స్వాగత ద్వారం నుంచి పురాతన కట్టడాల వద్దకు చేరుకునేందుకు రూ.11.80 కోట్లతో చేపట్టిన 0.660 కి.మీ రెండోదశ ఘాట్‌రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ. 13.5 కోట్లతో నగరవన పనులు, చెక్‌పోస్టు, టిక్కెట్‌ కౌంటర్‌, నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రూ.70 లక్షలతో నాలుగు పగోడాలు, రూ.20 లక్షల నిర్మాణంతో గజబుల నిర్మాణం, రూ.46 లక్షలతో ఆలయాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఆ దారితో పాటు- కోట లోపల రెండున్నర కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. రాశివనం, పంచవటి వంటి థీమ్‌ పార్కులు సిద్ధమవుతు న్నాయి. ఈ ప్రదేశం -టె-క్కింగ్‌, హైకింగ్‌ చేయడానికి కూడా అనువుగా ఉండటం వల్ల నిత్యం ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటోంది ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో మంత్రి విడదల రజని అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. కోటకు వెళ్లే మార్గం చాలా అందంగా ఉంటు-ంది. పాములా వంకర్లు తిరిగిన ఘాట్‌ రోడ్డుపై ప్రయాణం భలేగా అనిపిస్తుంది. కోటను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందు
కు యునెస్కో ప్రాథమికంగా అంగీకరించింది. అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించా ల్సిం దిగా ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement