అమరావతి: పరిషత్ ఎన్నికల సందర్భంగా జనసేన నేతలపైనా, కార్యకర్తలపై వైసిపి దాడులు చేస్తుండటం పట్ల ఆ పార్టీ న రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు..పరిషత్ ఎన్నికలలో ఎన్నికల్లో బలమైన పోటీగా తమ పార్టీ నిలవడంతో రాజకీయ కక్షతోనే జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై వైసిపికి చెందిన నేతలు దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది అత్యంత హేయకరమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని, తమకు ఎదురు నిలబడకూడదనే వైసీపీ వాళ్ళ ధోరణి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. కాగా, అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గంలోని రేగాటిపల్లిలో జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ గ్రామంలో చిలకం ఛాయాదేవి ఎన్నికల ఏజెంట్గా వ్యవహరిస్తుంటే అధికార పార్టీ బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. ఎస్సీ వర్గానికి చెందినవారిని దుర్భాషలాడి, దాడి చేయడం వైసీపీ అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని, దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ హడావిడిగా, తప్పుల తడకగా నిర్వర్తిస్తోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అసలు ఎవరూ పోటీ చేయకూడదనే భావన అధికార పార్టీకి ఉంటే కేవలం ఫ్యాన్ గుర్తు ఉన్న బ్యాలెట్స్ ఇస్తే సరిపోయేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు నాదెండ్ల..
Advertisement
తాజా వార్తలు
Advertisement