Friday, November 22, 2024

జగన్.. అధికారంలోకి వస్తే భూమిపై స్వర్గాన్ని సృష్టిస్తానని.. ప్రజలను నరకాన్ని చూపిస్తున్నారు : మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ

జగన్.. అధికారంలోకి వస్తే భూమిపై స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను నరకాన్ని చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పుట్టినరోజుకు ప్రభుత్వ నిధులు వెచ్చించడమేంటి? విజయవాడలో అధికారికంగా సాంస్కృతికశాఖ మంత్రి రోజా నృత్య కార్యక్రమాలు ప్రత్యక్షంగా ఆమే స్వయంగా నిర్వహించడంలో అర్థంలేద‌న్నారు. జగన్ పుట్టినరోజుకు సాంస్కృతిక, క్రీడాశాఖలు రూ.2.50 కోట్లు వెచ్చించడం దారుణమ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క సీఎం ఇలా చేయలేద‌న్నారు. ఎన్టీరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి యేడాది రక్తదానాలు చేస్తారు, శిబిరాల వద్దకు తీసుకొచ్చి రక్తమివ్వండని ఎవరూ అడగరు, డాక్టర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తార‌ని గుర్తు చేశారు. జేఎన్ టీయు, ఎన్ఎస్ఎస్ సంస్థల ద్వారా విద్యార్థులచే బలవంతంగా రక్తదానం చేయించడం హాస్యాస్పదమ‌న్నారు. బలవంతంగా రక్తదానం ఎక్కడా చేయించ‌రని పాలకులు అర్థం చేసుకోవాల‌న్నారు. ఈ మూడున్నర సంవత్సరాలుగా విద్యార్థులు, మహిళలు, యువకులు, వృద్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్థులు, కూలీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ వర్గంవారు కూడా సంతోషంగా లేర‌న్నారు. జ‌గ‌న్.. రాష్ట్రానికి ఏమీ చేయలేదు, రాష్ట్రాన్ని పరిపరివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో విద్యాదీవెన, వసతి దీవెన, నాడు-నేడు, అమ్మఒడి పెట్టిన అంశాలుగా పెట్టారు. పాల్గొనే విద్యార్థులకు జగన్ ప్రవేశపెట్టిన పథకాలను పొగిడితేనే ఫస్ట్, సెకండ్ మార్కులొస్తాయి. విమర్శనాత్మక ధోరణితో రాస్తే ప్రైజు రాదు కదా.. ప్రమాదం ఉంటుంది. కావున విమర్శనాత్మకంగా రాయొద్దని భయపడి తల్లిదండ్రులు విద్యార్థులకు చెబుతున్నారు. రేపు మీ వెంటపడే అవకాశముంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జగన్ స్వాతంత్ర్య సమరయోధుడా? రాష్ట్రంలో ఎవరూ తీసుకరాని సంస్కరణలు తీసుకొచ్చారనా?. ధీరాదాత్తుడనా? ఈ రాష్ట్రానికి మంచిపనులు చేశారనా? రాష్ట్రాన్ని ఆర్థికంగా , సాంఘికంగా, సాంస్కతికంగా అభివృద్ధి చేశారనా? రాష్ట్రం తలెత్తుకునేలా చేసిన వ్యక్తి అనా! ఎందుకు ఈ సంబరాలు? రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశార‌న్నారు. ప్రజల జీవన ప్రమాణాలను అధోపాతాళానికి నెట్టేశారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయేలా చేశార‌న్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానీయకుండా చేశాడ‌ని, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేద‌న్నారు. పారిశ్రామికులు భయంతో తరలి వెళ్లిపోయేలా చేశార‌న్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చారు, ప్రజలు నమ్మారు, నమ్మినందుకు నట్టేట ముంచారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement