Wednesday, November 20, 2024

న‌క్స‌ల్ కాల్పుల్లో అమ‌రులైన తెలుగు జ‌వాన్ల కుటుంబాల‌కు రూ.30 ల‌క్ష‌లు ఆర్థిక సాయం…

అమ‌రావ‌తి – చత్తీస్ గఢ్ లో నక్సల్స్ దాడిలో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. చత్తీస్ గఢ్ లోని సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏపీకి చెందిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ లు అమరులయ్యారు. వారి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా విజయనగరం పట్టణానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను రౌతు జగదీశ్‌(27). వీర మరణం పొందిన రౌతు జగదీశ్‌కు విజయనగరం వాసులు ఘనంగా నివాళులు అర్పించారు. భారీ జాతీయ జెండాతో యువకులు ర్యాలీ నిర్వహించారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రానికి జగదీష్ మృతదేహం స్థానిక గాజులరేగకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కొడుకును కన్నందుకు గర్వపడతున్నామని జగదీశ్ తల్లిదండ్రులు అన్నారు. ఇదిలా ఉండగా, రౌతు జగదీశ్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. మే 22న వివాహం కానుండడంతో ఒకటి రెండు రోజుల్లో ఇంటికి రావాలనుకున్నాడు. అంతలోనే పెళ్లింట తీవ్ర విషాదం అలముకుంది. పెళ్లి పనులు చూసుకునేందుకు ఈ నెల 5న ఇంటికి వస్తానని జగదీశ్‌ రెండురోజల కిందటే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. ఈలోగా ఘోరం జరిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement