Tuesday, November 26, 2024

కరోనా చికిత్సకు రోజుకు రూ. 75వేలు…పిండేస్తున్న కార్పొరేట్ హాస్పటల్స్

మమకారం చంపుకోలేక వచ్చి …. మృత్యువుతో పోరాడుతూ..
కరోనా ఆందోళనతో మనవాళ్లను చూసేందుకు వచ్చిన వృద్ధురాలు
కుటుంబమంతటికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
విద్యార్ధులు చదివే పాటశాల నుంచే వ్యాప్తి
మృత్యువుతో పోరాడుతున్న వృద్ధురాలు
కార్పొరేట్ ఆసుపత్రిలో రోజుకు 75 వేలు బిల్లు
గుంటూరుజిల్లా యడ్లపాడు లో ఒకకుటుంబం దయనీయ స్థితి

గుంటూరు – కుటుంబం పైన వున్న మమకారం ఆమె ప్రాణం మీదకు తెచ్చింది. తాను ఎంతో అల్లరుముద్దుగా చూసుకునే కుమార్తె, మనుమడు, మనవరాలు ను పలకరించేందుకు వచ్చిన ఒక వృద్ధురాలు కరోనా కోరల్లో చిక్కి మృత్యువుతో పోరాటం జరుపుతున్నారు. కుటుంబసభ్యులందరూ కోలుకున్నా ఆమె మాత్రం ఇంకా ఆసుపత్రి లోనే చావుబ్రతుకులా మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెకు చికిత్స జరిపే గుంటూరు లోని కార్పొరేట్ ఆసుపత్రి వారి బిల్లులు చెల్లించలేక కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. అసలామేకు నిజంగానే అంతటి ఖరీదైన చికిత్స చేస్తున్నారా? లేక ఆ పేరుతో లక్షలాది రూపాయలు గుంజుతున్నారా? అన్న సంశయం కుటుంబ సభ్యులలో తలెత్తుతోంది. ఇప్పుడు ఆ వృద్ధురాలు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు రావాలంటే ఎన్ని లక్షల రూపాయలు బిల్లు చెల్లించాలో అని వారు తల్లడిల్లిపోతున్నారు.

పలకరింపు కోసమని వచ్చి …
గుంటూరు జిల్లా మండలకేంద్రమైన యడ్లపాడులో ఒక మధ్యతరగతి రైతుకుటుంబం పిల్లల చదువుల కోసం గుంటూరు నగరంలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. పిల్లలిద్దరిలో ఒకరు 10, మరొకరు 9 వ తరగతి చదువుతున్నారు. వారితోపాటు వారి తల్లిదండ్రులు ఇరువురు వుంటున్నారు. ఆ పిల్లల అమ్మమ్మ యడ్లపాడు లో వుంటూ ప్రతిరోజూ వారి యోగక్షేమాలు విచారిస్తూ వుంటున్నారు. గుంటూరు నగరంలో కరోనా తీవ్రత అధికంగా వుండటంతో ఆ విషయం తెలుసుకొన్న ఆ వృద్ధురాలు తల్లడిల్లిపోయారు. వెంటనే పిల్లల మీద మనసుపడి వారిని చూసేందుకు గుంటూరు వచ్చారు. ఆ రోజున పిల్లలు ఇరువురు యధావిధిగా వారు చదివే స్కూలు కు వెళ్ళి తిరిగి వచ్చారు. వారిలో కొద్దిగా జ్వరలక్షణాలు కంపించటంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో ఇరువురు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే కుటుంబ సభ్యులు అందరూ పరీక్షలు చేయించుకున్నారు. ఆ విద్యార్ధుల తల్లి, అమ్మమ్మలకు సైతం కరోనా నిర్ధారణ అయింది. తండ్రికి మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో వారందరికి చికిత్స చేయించారు. మూడురోజుల్లోనే పిల్లలకు తగ్గిపోయింది. వారి తల్లి కి తగ్గక పోవటంతో అందర్నీ ఒకే చోట వుంచటం శ్రేయస్కరం కాని భావించి యడ్లపాడు లోని స్వగృహానికి పంపించారు. విద్యార్ధుల అమ్మమ్మకు కోవిడ్ లక్షణాలు కొంచెం ఎక్కువగా వుండటంతో ముందుజాగ్రత్తగా గుంటూరు కొత్తపేట బస్టాండ్ సమీపంలోనున్న ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

షాక్ కొట్టిన బిల్
గుంటూరు కొత్తపేట లోని కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు ఆ వృద్ధురాలిని పరీక్షించి ఆమెకు ప్రతిరోజూ 5 ఇంజెక్షన్ లు ఇవ్వాల్సి వుంటుందని చెప్పారు. ఆ విధంగా మూడు రోజుల పాటు చికిత్స అందించాలని తెలిపారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 15 వేల రూపాయలు వంతున రోజుకు 75 వేల రూపాయల బిల్లు వారి చేతిలో పెట్టారు. ఒక్కరోజుకే 75 వేల రూపాయలు ఖర్చు అయితే పూర్తిగా కోలుకునే వరకు ఇంకెంత వ్యయం అవుతుందోనన్న భయాందోళనలు వారిలో మొదలయ్యాయి. అప్పో సొప్పో చేసి వైద్యులు అడిగిన బిల్లులు చెల్లిస్తున్నారు. అయినప్పటికి ఆ వృద్ధురాలు ఇప్పటికీ పూర్తిగా కోలుకోక పోవటం ఆందోళన కలిగిస్తున్నది. అసలు ఆ వృద్ధురాలికి నిజంగానే అంతా ఖరీదైన వైద్యం అందిస్తున్నారా? లేక కేవలం డబ్బు గుంజెందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారా? అన్న సంశయం వారి కుటుంబీకులలో తలెత్తింది. ఒక వంక కుటుంబమంతా కరోనా బారిన పడటంతో విలవిలలాడిన ఆ కుటుంబం, తాజాగా కార్పొరేట్ ఆసుపత్రి వారికి చెల్లించాల్సిన బిల్లులు చూసి హడలిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వేరే ప్రత్యామ్నాయం లేక అతికష్టం మీద కాలం వెళ్లదీస్తున్నారు.

ఇరువురూ బాధ్యులే
ఆ కుటుంబం ఇంతగా తల్లడిల్లిపోవటానికి కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాకం తో పాటు, వారి పిల్లలు చదివే పాటశాల సైతం బాధ్యత వహించాల్సి వుంటుంది. ఆ స్కూల్ లో కరోనా నిబంధనలు పక్కాగా అమలు జరుగక పోవటం వల్లనే విద్యార్ధులు ఇరువురికీ కరోనా పాజిటివ్ వచ్చిందనటం ఓ సందేహం లేదు. ఆ విద్యార్ధుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆ విద్యార్ధుల అమ్మ, అమ్మమ్మ వేర్వేరు చోట్ల కరోనా తో పోరాడుతున్నారు. విద్యార్ధులు ఇరువురు తండ్రివద్దనే గుంటూరు లో బిక్కుబిక్కుమంటూ వారికోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబమంతా కరోనా బారిన పడటంతో బంధువులు సైతం వారిని పలకరించేందుకు రావటంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
         
Advertisement

తాజా వార్తలు

Advertisement