Tuesday, November 26, 2024

హోలీ పండుగ దందా – ఎస్ ఐకి చుక్క‌ల చూపిన మ‌హిళ‌లు..

మంగళగిరి క్రైమ్, ఫిబ్రవరి22 (ప్రభ న్యూస్): హోలీ పండుగ పేరుతో నడిరోడ్డుపై వాహనదారులను ఆపి బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఐదుగురు సభ్యుల కిలేడీల ముఠాను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. సేకరించిన వివరాల మేరకు… నగరంలోని రత్నాల చెరువు, దింపుడు కల్లం ప్రాంతాల్లో గత రెండు రోజుల నుండి వినుకొండ కు చెందిన ఐదుగురు మహిళలు రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డగించి హోలీ పండుగ పేరుతో బలవంతంగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల తాళాలు లాక్కొని డబ్బులు ఇస్తేనే తాళాలు ఇస్తామని బెదిరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో మంగళగిరి పట్టణ ఎస్ఐ మహేంద్ర సివిల్ దుస్తుల్లో బుధవారం తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా దింపుడు కల్లం వద్ద మహిళలు అడ్డగించి ఎస్ఐ ద్విచక్ర వాహనం తాళాలు లాక్కొని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఎస్ఐ మహేంద్ర రక్షక్ వాహన సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలను ఆపి బలవంతపు నగదు వసూళ్లకు పాల్ఫడుతున్న మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎస్ఐ మహేంద్ర తన ద్విచక్ర వాహనం తాళాన్నే లాక్కోవడం తో పాటు పలువురు ద్విచక్ర వాహనదారుల నుంచి బలవంతపు నగదు వసూళ్లకు పాల్పడిన ఐదుగురు మహిళలకు తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై నగరంలో తిరుగుతూ రోడ్లపై ప్రయాణించే వాహనదారులను ఆపి బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement