అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై విచారణకు హాజరుకావాలని చంద్రబాబునాయుడుకి సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగలింది.. సిఐడి విచారణపై స్టే విధించింది..కాగా, సిఐడి ఇచ్చిన నోటీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో వేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణ జరిగింది.. ఈ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అలాగే నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు.
ముందుగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు. ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని, అలాంటి ఆదేశాలు ఇక్కడ లేవని ఉన్నత న్యాయస్థానానికి న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఫిర్యాదులోని ఆరోపణలకు..పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. జీఓ విడుదలైన 35 రోజుల తర్వాత దానిని సీఎం ఆమోదించారని.. విచారణ నివేదికలోనే చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు సీఎంకు తెలిసి జీఓ ఇచ్చారని ఎలా చెబుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని, ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందన్నారు. మాజీ మంత్రి నారాయణ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జీఓను సవరించారని, జీవోకు సంబంధించిన చర్చలు, విడుదల చేసే ప్రక్రియలో గాని.. అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని, వ్యక్తిగతంగా వెళ్లి అసైన్డ్ రైతుల ల్యాండ్ తీసుకుని.. వారిని నష్టపరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయని దమ్మాలపాటి అన్నారు. ఒక జీవో ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం కల్పించి.. భూములు తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు తీసుకొనే సమయంలో.. అప్పటి ప్రభుత్వం అన్నివర్గాలకు లబ్ది చేకూర్చిందన్నారు. దాని ప్రకారమే భూములు సమీకరించారన్నారు. అనంతరం ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనల విన్న హైకోర్టు సిఐడి విచారణపై స్టే విధిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో షాక్ – సిఐడి విచారణపై స్టే..
Advertisement
తాజా వార్తలు
Advertisement