Saturday, November 23, 2024

Railway | గుంటూరు ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పొడగింపునకు రైల్వేబోర్డు ఆమోదం

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో : నిత్యం రద్దీగా ఉండే గుంటూరు రైల్వే జంక్షన్‌ నుంచి కీలకమైన ఎక్స్‌ప్రెస్‌లను పొడగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో పలు ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వేబోర్డు అధికారులు వెల్లడించారు. నిత్యం విజయవాడ – హుబ్లీ మధ్యన గుంటూరు మీదగా రాకపోకలు సాగిస్తోన్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ని నరసాపూర్‌ వరకు పొడిగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. నెంబరు.17225 విజయవాడ- హుబ్లీ అమరావతి ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే సాయంత్రం 4 గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి విజయవాడకు రాత్రి 7.35కి వచ్చి 7.45కి బయలుదేరుతుంది. నెంబరు. 17226 హుబ్లీ – విజయవాడ అమరావతి ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుతం విజయవాడకు వేకువజామున 5.40కి చేరుతోన్నది. ఈ రైలు 5.50కి విజయవాడలో బయలుదేరి ఉదయం 10.30కి నరసపూర్‌ చేరేలే రూపొందించిన షెడ్యూల్‌కి రైల్వేబోర్డు ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే పొడిగింపు తేదీలను రైల్వే శాఖ ప్రకటించనున్నది.

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు వరకు పొడిగింపు

ప్రస్తుతం విశాఖపట్టణం – విజయవాడ మధ్యన రాకపోకలు సాగిస్తోన్న ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ని గుంటూరు వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. నెంబరు. 22701 ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్టణంలో వేకువ జామున 5.25కి బయలుదేరి 11.05కి విజయవాడకువచ్చి 11.10కి బయలుదేరి 11.45కి గుంటూరు చేరుతుంది. నెంబరు. 22702 గుంటూరు-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 4.35కి బయలుదేరి 5.25కి విజయవాడ చేరి 5.30కి బయలు దేరుతుంది. ఈ రైలు రాత్రి 10.55కి విశాఖపట్టణం చేరుతుంది. దీనికి కూడా రైల్వేబోర్డు ఆమోదముద్ర పడింది.

- Advertisement -

లోండా వరకే వాస్కోడిగామ ఎక్స్‌ప్రెస్‌

నాన్‌ ఇంటర్‌లాకింగ్‌, ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా గుంటూరు మీదగా రాకపోకలు సాగించే షాలిమార్‌ – వాస్కోడిగామ ఎక్స్‌ప్రెస్‌ని ఆరురోజుల పాటు- లోండా వరకే నడపనున్నట్లు- సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెంబరు 18047 షాలిమార్‌ – వాస్కోడిగామ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 12, 13, 15, 17 19, 20 తేదీల్లో లోండా వరకే నడుస్తుందన్నారు. అలానే నెంబరు 18048 వాస్కోడి గామ – షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 15,16,18, 20,22,23 తేదీల్లో లోండా నుంచి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement