పొన్నూరు ఫిబ్రవరి 17 ప్రభ న్యూస్ – చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ లోని శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల వివరాలు, ప్రభుత్వ అనుమతులు, ఆలయ పునర్నిర్మాణం డిజైన్ అప్రూవల్ పై ఎండోమెంట్ అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని 28 వార్డులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి దాతలు నుంచి సేకరిస్తున్న విరాళాలకు రసీదులు ఇవ్వకుండా దేవుడి పేరు మీద దోపిడికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దేవుడు పేరు మీద దోపిడీకి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విధంగా వైసిపి నాయకులు, శాసనసభ్యుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారని విమర్శించారు. ఏడాది లోగా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వారి ఆలయ అభివృద్ధి పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని దుయ్యబట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అవినీతి పేచ్చు పెరిగిందని విమర్శించారు.
అయిన వాళ్లకు దోచిపెట్టడానికి ఆలయాలు నిలయాలుగా మారాయని ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతికి పాల్పడటం బాధాకరమన్నారు. నియోజకవర్గంలోని అధికారులే శాసనసభ్యునికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేవుడి పేరు మీద దోపిడీ చేస్తే సహించేది లేదని ధూళిపాళ్ల హెచ్చరించారు. తాము అభివృద్ధికి అడ్డం కాదని, అనధికారికంగా చేస్తున్న వసూళ్లు సబబు కాదని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి పాదర్దర్శకతగా, దోపిడీ, వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఆలయంలోని నిధులను తమ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. పొన్నూరు శ్రీ సాక్షి భవనారాయణ స్వామి దేవస్థానంలో అనువంశిక ధర్మకర్త కొన్ని అవినీతి పనులకు అడ్డుకట్ట వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీ సాక్షి భావనన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య తన సతీమణిని నియమించారని చెప్పారు. పొన్నూరు ఆటోనగర్ పేరుతో సాక్షి భవనారాయణ స్వామి భూములను బినామీ పేర్లతో తీసుకొని ఆటోనగర్ కు అద్దెకు కు ఇవ్వాలని చూస్తున్నారన్నారు. వందల ఎకరాల ఆలయ భూములు, ఆస్తులపై స్థానిక ఎమ్మెల్యే కళ్ళు పడ్డాయని ఆయన ఆరోపించారు పెదకాకాని లోని దేవస్థానం నిధులు రూ 80 లక్షలు తో గ్రామపంచాయతీ రోడ్డు నిర్మాణానికి వినియోగించారని ఆరోపించారు. ఆలయ అభివృద్ధి నిధులను మహాశివరాత్రి రోజున వైసిపి నాయకులు మహా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. నియోజవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు దేవుని పేరుతో దందాలు ప్రారంభించారని ఎద్దేవ చేశారు. అనపర్తి లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని పోలీసులు బలవంతంగా నిలిపివేయడం అప్రజాస్వామ్యం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను హరించి వేయడం దురదృష్టకరమని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలకు నరేంద్ర కుమార్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.