Sunday, November 17, 2024

మూడు రోజుల నుండి వృధాగా పోతున్న తాగునీరు

.తెనాలి : తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 40 వార్డులలో త్రాగునీటి సమస్య ఉంది. ఈ త్రాగునీరు కొన్నిచోట్ల సరఫరా ఉంటే మరి కొన్నిచోట్ల సరఫరాలో తీవ్ర అంతరాయంగా ఉంటున్నది. ఇటీవల చైర్మన్ గా ఎన్నికైన సయ్యద్ ఖాలేదా నసీం తన తొలి ప్రాధాన్యత త్రాగునీటి సరఫరా లో అంతరాయం లేకుండా చేయడమేనని, అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే పట్టణంలో పలుచోట్ల త్రాగునీరు పైపులు లీకేజ్ అయ్యి వాటిలో మురుగునీరు కలుస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక పట్టణ శివారు ప్రాంతం గురవయ్య కాలనీ డొంక రోడ్డు, పూలే కాలనీలకు అయితే త్రాగునీరు సరఫరా లేకపోవడం తో మున్సిపల్ అధికారులు వాటర్ ట్యాంకర్ ద్వారా రెండు మూడు రోజులకి ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని చాలాచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమృత్ పధకం క్రింద త్రాగునీటి ప్రాజెక్టును ప్రారంభించిన నాటి నుండి దానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ముందు ఉచిత కనెక్షన్లు అన్నారు. తరువాత డిపాజిట్లు కట్టాల్సిందేనన్నారు. అసలు కనెక్షన్లు వద్దన్నవారికి కూడా బలవంతంగా అంటకట్టారు. ఫిర్యాదుల నేపథ్యంలో నూతన చైర్ పర్సన్ ఖాలేదా నసీం అధికారులతో చర్చించి త్వరితగతిన ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక క్షేత్రస్థాయిలో వాటరువర్క్స్ అధికారుల పనితీరు ఎలా ఉందో చూద్దాం. గత మూడు రోజులుగా స్థానిక బాలాజీ నగర్లోని చినరావూరు పార్క్ రోడ్ సమాధుల వద్ద ఉన్న పైపులైన్లలో త్రాగునీరు లీకై వృధాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ కొర్ర యశోదా కపూర్ ప్రతిరోజు ఇదే వీధి నుండి రాకపోకలు సాగిస్తుంటారు కూడా. ఈ రకంగా త్రాగునీరు వృధా అవడం పట్ల కౌన్సిలర్ గాని అధికారులు గాని చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మరమ్మతులు నిర్వహించి త్రాగు నీటి వృధాను అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement