Saturday, November 23, 2024

కొలకలూరు దళితవాడ లో తాగునీటికి కటకట

తెనాలి రూరల్, ఫిబ్రవరి 20, (ప్రభ న్యూస్): కొలకలూరు దళితవాడ తాగునీటికి కటకటలాడుతుంది. అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కప్పదాటు వ్యవహారంతో మొహం చాటేస్తున్నారని సోమవారం దళితులు ఖాళీ బిందెల తో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టిడిపి ఎస్సీ సెల్ నాయకులు ఉన్నం రాంబాబు మాట్లాడుతూ గతంలో కలుషిత నీరు ప్రభావం వల్ల ఒకరు చనిపోయారని, దళితవాడ అంటే అధికారులకు లెక్క లేకుండా పోయిందని, తమను ఇంత చిన్నచూపు చూడటం దుర్మార్గమైన విషయమని ఇంకా ఎంతమంది చనిపోవాలని, వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. ఇలా ఎంతమందికి తాము ఫిర్యాదు చేయాలని అందుకే ధర్నాకు దిగవలసి వచ్చిందన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెనాలి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్ బాధితులకు హామీ ఇస్తూ ఈవో వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కొత్త పైపులైను ద్వారా నీటిని అందిస్తామని అన్నారు. దీంతో దళితులు శాంతించి ధర్నా విరమించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు కొలకలూరి క్రిష్, కోపల్లె శ్రీను, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు మోదుకూరి దావీదు, గొరిగపూడి కోటేశ్వరరావు, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement